Minister Lokesh : మాజీ సీఎం మాటలకూ ఘాటుగా స్పందించిన మంత్రి లోకేష్
కాగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు...
Minister Lokesh : వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందన్నారు. బాధితులనే నిందితులుగా చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందని అన్నారు.
Minister Lokesh Comment
ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని మంత్రి లోకేష్(Minister Lokesh) విమర్శించారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? అని అన్నారు. నేరాలు చేసి… మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఏ ఘటననూ ఉపేక్షించేది లేదని, ఏ నిందితుడినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదన్నారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని మంత్రి నారా లోకేష్(Minister Lokesh) పేర్కొన్నారు.
కాగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. వినుకొండలో నడిరోడ్డులో జరిగిన హత్యాకండపై గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ… లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైయస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు.కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అంటూ విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారంటూ జగన్ ట్వీట్ చేశారు.
Also Read : Supreme Court-Neet : నీట్ పేపర్ లీకేజీ పై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం