Tarun Chugh : తెలంగాణ సీఎంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh). ఆయన చేసిన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడుతాయన్న భయంతోనే తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ తెలంగాణకు సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ పతనాన్ని కోరుకుంటోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఓ వైపు ఖాళీలు ఉన్నా, నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం కేసీఆర్ కే చెల్లిందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు తరుణ్ చుగ్(Tarun Chugh). తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతుంటే తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ సంపద, వనరులను దోచుకునే పనిలో పడిందని మండిపడ్డారు.
ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మార్పు తథ్యమని, తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు తరుణ్ చుగ్.
దోచుకున్న సొమ్ముతో తమ పార్టీపై, నేతలపై అవాకులు చెవాకులు పేలుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. తాము చేస్తున్న పోరాటంతో సీఎం కాళ్ల కింద భూమి కదిలిందన్నారు.
రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలు మారుస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
Also Read : కేంద్రాన్ని ప్రశ్నించినందుకే అరెస్ట్