Narayanaswamy : ఆ పథకాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం
జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొనసాగిస్తాను అన్న చంద్రబాబు నేడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు...
Narayanaswamy : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎంతటి పరాజాయాన్ని చవిచూసిందో అందరికీ తెలిసిందే. వైసీపీకి కేవలం 11 సీట్లను మాత్రమే కట్టబెట్టారు ప్రజలు. కూటమి భారీ విజయం సాధించడం.. ఆపై చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం అంతా జరిగిపోయింది. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన అప్పటి మంత్రులు ఏమయ్యారో అనే టాక్ నడుస్తోంది. పరాజయం తర్వాత వైసీపీ నేతలు ఒక్కరు కూడా మీడియా ముందుకు రాని పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి(Narayanaswamy)… ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని… గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. 40 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఈరోజు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
Narayanaswamy Comment
జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొనసాగిస్తాను అన్న చంద్రబాబు నేడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ పెట్టి…పేదల కడుపు కొట్టారని విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇన్ని పథకాలు నాశనం చేశారని.. అయినా పర్లేదు కానీ విద్య, వైద్యం పథకాల జోలికి వెళ్ళద్దని బాబు, లోకేష్, పవన్‌లకు విజ్ఞప్తి చేశారు. ‘‘ చంద్రబాబును ఒక విషయంలో అభినందిస్తున్నాను…బాబు తన సామాజిక వర్గం ద్వారానే విజయం సాధించగలిగారు’’ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కులాల గురించి ప్రస్తావించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదో తప్పు చేశామని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్ళిందన్నారు. జగన్ కార్యకర్తలతో మాట్లాడి బలపడుతున్నారని.. ఈ రకంగా జగన్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చంద్రబాబు పెట్టిన బ్రాండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయన్నారు. తాను తప్పు చేసినట్లు అయితే ఏ శిక్షకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. వాసుదేవరెడ్డి దగ్గర తాను కీలుబొమ్మగా బ్రతక వలసిన అవసరం లేదన్నారు. నీతి నిజాయితీగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు. ‘‘ నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తాను. నా కుమార్తె ఓడిపోవడానికి గల కారణాలు నేను చెప్పదల్చుకోలేదు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే ఏ గ్రామంలో అయినా సేవచేశారు. మా పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లిన వారు ఇప్పుడు గెలిచారు.
రాజకీయాల్లో ఖర్చు పెట్టకుండా ఎవరూ పనిచేయట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ నాలాగా ఎవరూ తీసుకురాలేదు’’ అని చెప్పుకొచ్చారు. మద్యపానాన్ని తగ్గిస్తామని చెప్పి రెండు నెలలు అయిందన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి తమ గవర్నమెంట్‌ను పడగొట్టారని అన్నారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో రికార్డులు తగలపెట్టారని.. అవన్నీ ఆన్లైన్లో ఉంటాయి కదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎవరూ తప్పు చేయలేదా అని అడిగారు. ‘‘ నేను ప్రశ్నిస్తే నా ఇంటిని కూలగొడతారు.పేదవాళ్ళను ఓడించడానికి పెత్తందార్లు అందరూ ఒక్కటిగా వచ్చి ఓడించారు. మైన్స్ అన్నీ చంద్రబాబు సామాజిక వర్గం వారివే ఉన్నాయి’’ అంటూ నారాయణ స్వామి(Narayanaswamy) వ్యాఖ్యలు చేశారు.
Also Read : Swapnil Kusale : ఒలింపిక్స్ లో మరో పతకం సాధించిన స్వప్నిల్