KTR : కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ పై కేటీఆర్ ఆగ్రహం

ఇటీవల కూడా రుణమాఫీపై కేటీఆర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు...

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేటీఆర్ పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కేటీఆర్(KTR). ఎక్స్ వేదికగా స్పందిస్తూ… ‘‘రుణం తీరలే, రైతు బతుకు మారలే.. ! స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు. కేబినెట్ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించింది. రూ. 26 వేల కోట్లు 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు. అయినా తగ్గేదే లేదు.. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెపుతాం. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Comment

ఇటీవల కూడా రుణమాఫీపై కేటీఆర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌పై విరుచుకుపడ్డారు. రుణమాఫీపై సీఎంకు కేటీఆర్(KTR) సవాల్ విసిరారు. ” సీఎం రేవంత్ రెడ్డి భద్రత లేకుండా కొడంగల్ నియోజక వర్గానికి రావాలి. నేనూ వస్తా. ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే అక్కడే నేను రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. దమ్ముంటే నా సవాల్‌ని స్వీకరించు. రుణమాఫీ పూర్తిగా చేయకుండానే సంపూర్ణంగా మాఫీ చేశామని చెప్పడం దిగజారుడుతనం. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్ మానసిక స్థితిపై నాకు అనుమానం ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. ఒకేసంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. తొలుత రూ.40 వేల కోట్లతో మాఫీ అంచనాలు వేసి ఇప్పుడు కేవలం రూ. 27 వేల కోట్లకే పరిమితం చేయడం ఏంటని కేటీఆర్(KTR) ప్రశ్నించారు. జులై రాగానే లబ్ధిదారుల్లో సగానికిపైగా రైతులకు కోత విధించి మాఫీ అమలు చేశారని అన్నారు.

కాగా..రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది. అయితే ఈ కేటగిరీల్లో ఇంకా కొందరు రైతులు మిగిలిపోయారు. రేషన్‌ కార్డులులేని, సాంకేతిక సమస్యలతో అనర్హుల జాబితాలో చేరిన రైతులకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. ఈ మూడు కేటగిరీల్లో కలిపి ఇప్పటివరకు 22,22,067 మంది రైతులకు రూ. 17,869.26 కోట్లు మాఫీచేశారు. రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులతోపాటు, మొదటి మూడు స్లాబుల్లో మిగిలిపోయిన రైతులకు నాలుగో విడతలో రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. నెల రోజుల క్రితం ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15న మార్గదర్శకాలతో కూడిన జీవోను విడుదల చేసింది. జూలై 18న మొదటి విడత, జూలై 30న రెండో విడత, ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేసింది.

Also Read : CM MK Stalin : 2026 ఎన్నికల్లో 200 సీట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు

Leave A Reply

Your Email Id will not be published!