Kolkata Doctor Case : నేటి నుంచి సమ్మె ముగించి విధుల్లో చేరనున్న జూనియర్ డాక్టర్లు
ఈ నేపథ్యంలో అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే పాల్గొని వైద్య సేవలందిస్తామని స్పష్టం చేశారు...
Kolkata : వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి. దాంతో 42 రోజుల పాటు సాగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన శుక్రవారంతో ముగిశాయి. దీంతో నేటి నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే వారు పాల్గొనున్నారు. అవుట్ పేషంట్ విధులకు మాత్రం వారు హాజరు కాబోరు. ఆందోళన విరమించే వేళ ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. రేపటి నుంచి వైద్య సేవల్లో పాక్షికంగా పాల్గొంటామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం అభయ్ పేరిట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వరదల నేపథ్యంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పాక్షికంగా ఒప్పుకుందని స్పష్టం చేశారు.
Kolkata Doctor Case..
ఈ నేపథ్యంలో అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే పాల్గొని వైద్య సేవలందిస్తామని స్పష్టం చేశారు. ఇక తమ డిమాండ్లను పూర్తిగా నేరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని మరో జూనియర్ డాక్టర్ వెల్లడించారు. దీంతో మళ్లీ ఆందోళనలకు దిగి అవకాశం లేక పోలేదన్నారు. ఇక జూనియర్ డాక్టరు ఆందోళన విరమించే ముందు సీజీఓ కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు గౌరి రాయ్.. జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి 42 గులాబీలున్న పుష్పగుచ్చాన్ని వారికి అందజేశారు.
మరోవైపు వైద్యురాలికి న్యాయం జరగాలంటూ శుక్రవారం సాయంత్రం కోల్‌కతా(Kolkata) మహానగరంలో 42 కిలో మీటర్ల మేర భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది పౌరులు తమ సంఘీభావం తెలుపుతూ.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో న్యాయం జరగాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అలాంటి వేళ వారిని చర్చలకు మమత బెనర్జీ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం ముందు వారు పలు డిమాండ్లు ఉంచారు. ఆ క్రమంలో కొన్ని డిమాండ్లను మాత్రం పరిష్కరించేందుకు సీఎం మమతా బెనర్జీ సూత్రప్రాయంగా అంగీకరించారు. దాంతో తాము పాక్షికంగా వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ డిమాండ్లలో భాగంగా కోల్‌కతా(Kolkata) నగర పోలీస్ కమిషనర్‌తోపాటు వైద్య ఆరోగ్య విభాగంలోని పలువురు ఉన్నతాధికారులను సైతం మమతా ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Kukkala Vidyasagar: వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్