CM Revanth Reddy : కేసీఆర్ సర్కార్ చేసిన నిర్వాకాన్ని మేము సరిదిద్దుతున్నాం
అందుకే ప్రజలు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టారని ఎద్దేవా చేశారు...
CM Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది తప్పులు.. అప్పులే.. వీటితో తెలంగాణ నిండా మునిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ తప్పులు… అప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు కంటోన్మెంట్ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రానికి భూ బదలాయింపు ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంతో పాటు విచక్షణ కొల్పోయిందని ఎద్దేవా చేశారు.. పదేళ్లు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ధ్వజమెత్తారు.
CM Revanth Reddy Comment
అందుకే ప్రజలు కేసీఆర్(KCR) ఉద్యోగం ఊడగొట్టారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టులను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉద్ఘాటించారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ నేతలు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము వాళ్ల పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని. విమర్శించారు. అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పాలని అన్నారు. ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని అన్నారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
‘‘మూసీ మురుగులో బతుకుతున్న పేదలకు ఇళ్లు, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌లు కూల్చాలా వద్దా? మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. వాటిని కూలగొట్టాలా వద్దా..? ఫాంహౌస్‌లు కూలుతాయనే పేదలను అడ్డు పెట్టుకుంటున్నారు. నల్లచెరువులో, మూసీనది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా..? 20ఏళ్లు ప్రజల్లో తిరిగినవాన్ని నాకు పేద ప్రజల కష్టాలు తెలియదా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు..? జవహర్ నగర్‌లో 1000 ఎకరాలు ఉంది… రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇళ్లు కట్టిద్దాం.
ఇక్కడి ఎంపీ ఈటల రాజేందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఏం తీసుకువస్తారో చెప్పాలి. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు కానీ.. మూసీని అభివృద్ధి చేయొద్దా ఈటలా? కేటీఆర్(KTR), హరీష్‌రావులు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటల మాట్లాడుతున్నారు. పార్టీ మారినా ఈటలకు పాత వాసనలు పోలేదు. మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు ఇళ్లు తీసుకురావడానికి మోదీ దగ్గరకు వెళ్దాం రండి… నాకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవు.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రావాలి. నగరంలో చెరువులు, ఆక్రమణల లెక్క తీద్దాం రండి… వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు.
‘‘ఇప్పటికే చెరువులు, నాళాలు మూసుకుపోయాయి.. ఇలాగే చూస్తే.. ఇంకొన్నాళ్లకు మూసీ కూడా మూసుకుపోతుంది.. రాజకీయాల్లో నాకు లోతు తెలియక కాదు.. భాగ్యనగరానికి మంచిభవిష్యత్‌ను అందించేందుకే మా చర్యలు.. పేదల దుఃఖం నాకు తెలుసు.. పేదవాడి కన్నీళ్లు చూడాలని మేం కోరుకోవడంలేదు. ప్రతీ పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే మా ప్రభుత్వ ఉద్దేశం.. చెరువులు, నాళాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే… పేదలకు ఎలా న్యాయం చేద్దామో మీరు చెప్పండి… మీ పదేళ్ల పాలన దోపిడీకే పనికి వస్తుందా…? పదేళ్లు పాలించామని, అనుభవం ఉందని చెబుతున్న వారు పేదలకు ఏం చేద్దామో చెప్పాలి.
మొత్తం మంత్రివర్గాన్ని తీసుకువస్తా.. మోదీ వద్దకు తీసుకెళ్లి ఈటల రాజేందర్ రూ.25వేల కోట్లు నిధులు ఇప్పించగలరా… ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇవ్వడం నేరమా? విషాన్ని దిగమింగుతున్న నల్లగొండ ప్రజలను కాపాడాలని అనుకోవడం తప్పా. మీకు ఓటు వేయనందుకు నల్లగొండ ప్రజలను చంపేయాలని చూస్తారా? మీలాంటి వారి కోసం బుల్డోజర్లు అవసరం లేదు. రాజకీయాల కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టలేదు.. హైదరాబాద్ భవిష్యత్ కోసమే మేం ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. సంచులు తీసుకున్నవారికే సంచుల గురించి తెలుస్తుంది.. ఇళ్లు తొలగిస్తే ఎవరైనా సంచులు ఇస్తారా? తిట్లు తప్పా. దోపిడీ సొమ్ముతో కేటీఆర్ అడ్డగోలు పనులు చేస్తే ప్రజలు క్షమించరు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.
Also Read : Supreme Court of India : జైళ్లలో కుల వివక్షపై సంచలన తీర్పునిచ్చిన ధర్మాసనం