J&k Election Results 2024 : కాబోయే సీఎం ఎవరనేది క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం

జైల్లో ఉన్న అమాయక ప్రజలను బయటకు తీసుకు వస్తామన్నారు...

J&k Election Results : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు పక్కాగా క్లారిటీ ఇచ్చాడు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీకి జమ్మూ కశ్మీర్(Jammu&Kashmir) ఓటరు అధికారాన్ని కట్టబెట్టాడు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మంగళవారం శ్రీనగర్‌లో స్పందించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah)నే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు కచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలను ఆలకించారని ఈ సందర్భంగా తెలిపారు.

తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. జైల్లో ఉన్న అమాయక ప్రజలను బయటకు తీసుకు వస్తామన్నారు. అలాగే మీడియాకు సైతం స్వేచ్ఛ లభించినట్లు అయిందని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీసుకు వచ్చేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక హరియాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సైతం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలే ఆ పార్టీ ఒటమికి కారణమని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.

J&k Election Results 2024 Update

మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 08వ తేదీన అంటే.. నేడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ, పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ)లు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే మధ్యాహ్నం 2.00 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. నేషనల్ కాన్ఫరెన్స్ 41, కాంగ్రెస్ 5, బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇతరులు 11 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే.. 46 స్థానాలు రావాల్సి ఉంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. జమ్మూ కశ్మీర్‌లో దాదాపు దశాబ్దం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి రాష్ట్ర ఓటరు పట్టం కడతాడంటూ సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటరు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టినట్లు అయింది.

Also Read : Vinesh Phogat : ప్రముఖ భారత రెజ్లర్ ‘వినేష్ ఫోగట్’ జలనా సీటు నుంచి విజయం

Leave A Reply

Your Email Id will not be published!