Kadambari Jethwani : వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు కాదంబరి కేసులో షాకిచ్చిన హైకోర్టు

అరెస్టు చేసేటప్పుడు నిందితుడిపై ఎవరు ఫిర్యాదు చేశారు..

Kadambari Jethwani : సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ(YCP) నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను గతంలో హైకోర్టులో విద్యాసాగర్ సవాల్ చేశారు. విద్యాసాగర్‌ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్(Kukkala Vidyasagar) అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. కాగా.. తనకు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై గతవారం హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో విద్యాసాగర్‌ తరఫున టి. నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్‌ అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని, అరెస్టుకు కారణాలను ఆయనకు వివరించలేదని అన్నారు. బంధువులకు తెలియజేయలేదని తెలిపారు. అరెస్టుకు కారణాలను రిమాండ్‌కు ముందు ఆయనకు అందజేశారని.. రిమాండ్‌ ఆర్డర్‌లో కూడా వీటి ప్రస్తావన లేదని.. అందుచేత రిమాండ్‌ ఉత్తర్వులు చెల్లుబాటు కావని, వాటిని కొట్టివేయాలని కోరారు.

Kadambari Jethwani Case

అయితే కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నారని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. అరెస్టు చేసేటప్పుడు నిందితుడిపై ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏ కారణంతో అరెస్టు చేస్తున్నామో వారు వివరించారని.. అరెస్టు చేస్తున్న విషయాన్ని ఆయన స్నేహితుడికి కూడా తెలియపరిచారని వివరించారు. విద్యాసాగర్‌ను అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించేందుకు అనుమతి కోరుతూ ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని.. కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్‌ ఆర్డర్‌పై పిటిషనర్‌ సంతకం కూడా చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అరెస్టుకు కారణాలు చెప్పలేదని, పోలీసులు చట్టనిబంధనలు అనుసరించనందున రిమాండ్‌ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్న విద్యాసాగర్‌ వాదనలో అర్థం లేదని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు.. విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

Also Read : Bishnoi Gang Threats : పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్

Leave A Reply

Your Email Id will not be published!