Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థ రద్దుపై ఓ సంచలన ప్రకటన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు...
Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరని స్పష్టం చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.
Deputy CM Pawan Comments..
డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) సమావేశం అయ్యారు. సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి సర్పంచ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) మాట్లాడుతూ..దేశంలో 70శాతం ప్రజలు పల్లెల్లోనే ఉంటారని.. గ్రామాలను బలోపేతం చేస్తూ గాంధీ సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆకాంక్షతోనే తాము ఉన్నామన్నారు. మాటలతో కాకుండా చేతలతోనే తమ ప్రభుత్వం పని తనం చూపుతుందని తెలిపారు. సర్పంచ్‌లు ఇచ్చిన 16 డిమాండ్స్‌లో కీలకమైన వాటిని గుర్తించి వాటిని పూర్తి చేశామన్నారు. కేరళలో పని చేస్తున్న అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్ మీద తీసుకువచ్చామని తెలిపారు. ఆయన సహకారం వల్లే నేడు గ్రామాల అభివృద్దికి ప్రణాళికులు సిద్దం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పేషీలో ప్రజలకు మేలు చేద్దామనే ఆకాంక్ష ఉన్న అధికారులు ఉండటం అదృష్టమన్నారు.
ఎంపీ ల్యాండ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని.. ఆ నిధులు విడుదల చేసేందుకు క్యాబినెట్‌లో కూడా నిర్ణయించామని తెలిపారు. అమరావతిలో పంచాయతీరాజ్ భవనానికి రెండు ఎకరాలు కేటాయించాలని తనని కోరారని..ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మాణం చేసే విధంగా అవసరమైన స్థలం కేటాయిస్తామని వ్యాఖ్యానించారు. గ్రామాలలో నరేగా పధకం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటికే దీనిపై పల్లె వనాలు పేరుతో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్‌లకు ప్రధమ పౌరుల స్థానం ఇవ్వాలని అప్పుడే వారికి ఆ గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని.. స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని అన్నారు.
12వేల 900 గ్రామ పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని..8629 కోట్ల రూపాయలు వారు ఇతర అవసరాలకు మళ్లించేశారని వివరించారు. ఈ అంశాలను సీఎం(CM), ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకువెళతానన్నారు. మరో నెల రోజుల్లో 750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని తెలిపారు. ప్రధాని కూడా గ్రామీణాభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని.. గత ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిని సరి చేయడానికి సీఎం చంద్రబాబు అనుభవం ఇప్పుడు కీలకంగా మారిందన్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసేలా చంద్రబాబు(Chandrababu) నాయకత్వంలో తాము పని చేస్తున్నామని తెలిపారు. మరోసారి అధ్యయనం చేసిన తర్వాత సర్పంచుల డిమాండ్లపై ఒక స్పష్టత ఇస్తానన్నారు. గ్రామ సచివాలయలు సమాంతర వ్యవస్థలుగా మారాయిని.. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి.. వారిని ఏ విధంగా వినియోగించాలనేది ఆలోచన చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసి పెట్టుకుందన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని స్పష్టం చేశారు. వారు అసలు ఉద్యోగాల్లోనే లేరంటే.. ఇక రద్దు అనే అంశం ఎక్కడ ఉంటుందన్నారు.
సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు వేతనాలు పెంపుపై కూడా కసరత్తు చేస్తున్నామన్నారు. అయితే పంచాయతీలలో కూడా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్ధికంగా ఎదగాలన్నారు. వచ్చే యాభై ఏళ్ళలో కలప అవసరం చాలా ఉంటుందని తెలిపారు. అందువల్ల గ్రామాలలో వెదురుబొంగులను పెంచి.. బయో డీజిల్ తయారీకి సరఫరా చేసేలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి కలపను పెంచేలా లక్ష్యాలను నిర్దేశిస్తే ఆదాయం వస్తుందని తెలిపారు. పంచాయతీల అభివృద్ది సభల్లో సర్పంచ్ లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారని..కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో ఆపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులే ప్రోటోకాల్ పాటించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 35వేల కోట్లు గత ప్రభుత్వం వాడేసుకుందని.. నాయకులు, పాలకులు చేసిన తప్పులకు.. ఎకౌంట్ బులిటీ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో కూడా లెక్కలు తేలడం లేదన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక చర్చ జరిగేలా చూస్తామన్నారు.
జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో తాగు నీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ 24గంటలూ నీరు రావాలనేది ప్రధాని ఆకాంక్ష, సంకల్పమన్నారు. వాటర్ పైప్ డిజైనింగ్ లో చాలా చోట్లా తప్పులు జరుగుతున్నాయని.. టెక్నాలజీ సాయంతో పర్మినెంట్ గా ఉండే విధంగా వాటర్ పైప్ లైన్ ఉండాలని అన్నారు. గ్రామాలలో చెరువుల్లో పూడికలు తీసి.. నీరు కలుషితం కాకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీరు కూడా మంచినీరు మార్చుకనేలా నెల రోజుల్లోనే పనులు చేపడతామని తెలిపారు.
మైనింగ్, ఇసుక రవాణా అంశాలలో ఆయా గ్రామాలకే సీనరేజ్ వచ్చేలా చూస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పంచాయతీల అబివృద్దికి పని చేస్తున్నామన్నారు. వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 నుంచి పదివేలు, మేజర్ పంచాయతీలకు 250 నుంచి 25వేలు ఇచ్చేలా చేశామని..గ్రామాలలో ఎటువంటి అభివృద్ది జరిగినా.. సర్పంచ్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిదులకు సరైన ప్రాతనిధ్యం ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ ను గతంలో నిర్వీర్యం చేసుకుంటూ వెళ్లారని..గ్రామాలలో జరిగే పనులన్నీ ప్రజలకు కూడా తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ ఆడిట్ కు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
Also Read : Chandrababu Slams : జగన్ చేసిన పాపాలకు ప్రజలు బలవుతున్నారు