CM Chandrababu : స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల నుంచైనా పని చేసుకోవచ్చు
దక్షిణాది జనాభా అంశంపై సీఎం మాట్లాడుతూ....
CM Chandrababu : దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఏపీ(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెలీకాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చామని.. దాన్ని అమలు చేయడం వల్ల టెలీకాం రంగం వృద్ధి చెందిందని తెలిపారు. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నామని.. దేశంలోనే ఇది తొలిసారిగా అమలు చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చని తెలిపారు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) వెల్లడించారు.
CM Chandrababu Thought
దక్షిణాది జనాభా అంశంపై సీఎం(CM) మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌంట్ ఎయిడ్స్ అనే నినాదాన్ని ఇచ్చాను. ఇప్పుడు బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ అని పిలుపునిస్తున్నాను. ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది. ఫెర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతోంది. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మొదలవుతుంది.
భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం సరిగా ప్లాన్ చేస్తే 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేస్తారు. భారతదేశానికి ఆదాయం తీసుకొస్తారు. బ్రిటీష్ వాళ్లు ఎలాగైతే భారత్కు వచ్చి పరిపాలించారో, మనం కూడా అలాగే ప్రపంచదేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలవచ్చు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించాను. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలి ఇప్పుడు’’ అంటూ నవ్వుతూ చెప్పారు సీఎం(CM).
పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలని… మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి జరగాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1వ తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. నీటికి భద్రత సృష్టించుకోవాలన్నారు. బీజేపీకి వాజ్ పేయి పునాదులు వేస్తే, నరేంద్రమోడి బలోపేతం చేశారన్నారు. మోడీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో భారతదేశం రెండు, మూడు స్థానాల్లో ఉంటుందన్నారు. ‘‘నరేంద్రమోడి మా లీడర్, ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం. హర్యానా సీఎం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగింది.
నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై మోడి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏపీ(AP)లో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపారు. దాని ఫలితం ఇప్పుడు చూశాం. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏకపక్షంగా వీస్తాయని మేము ముందుగానే ఊహించాం. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం. కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. వ్యక్తిత్వ హసనం జరుగుతోందన్నారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Also Read : Hindustan Times Summit : ఓ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ