CM Revanth Reddy : అదానీ, ప్రధాని మోదీ కలిసి భారత దేశ పరువును తీశారు
తమ డిమాండ్ కోసం నిరసన తెలపడం, చట్ట సభలను స్తంభించడం చేస్తామన్నారు...
CM Revanth Reddy : ప్రధాని మోదీ, అదానీ అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శలు గుప్పించారు. అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితిని తెచ్చారని మండిపడ్డారు. అదానీ, ప్రధాని కలిసి దేశ పరువు తీశారని విమర్శించారు. జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy Comments
తమ డిమాండ్ కోసం నిరసన తెలపడం, చట్ట సభలను స్తంభించడం చేస్తామన్నారు. ఎన్ని నిరసనలు చేసినా మోదీ దిగిరావడం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. దేశం కోసం రోడెక్కుతామని.. చట్ట సభల్లో నిరసన తెలియచేస్తామని స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్ సన్నాసులు ముఖ్యమంత్రి నిరసన ఎలా చేస్తారు అని అంటున్నారు. నేను చేయను. మీరు చేయండి. అదానీ విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలి. బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్టును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల వైపా? అదానీ ప్రధాని వైపా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత చెప్పాలి. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతోంది’’అంటూ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోరాష్ట్రపతి భవన్ కూడా ముట్టడిస్తామన్నారు. అదానీ విషయంలో వైఖరి ఏంటో రేపు పొద్దున్న వరకు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయాలన్నారు. ప్రజాకోర్టులో ప్రధానిని శిక్షించేదాక కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని.. ప్రధాని పట్టించుకోవడం లేదనే రోడ్లపైకి రావాల్సి వచ్చింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. మరోవైపు రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేస్తుండగా.. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసనకు దిగింది. అదానీ విషయంలో కేసీఆర్ స్టాండ్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయగా… అదే సమయంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని, రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లాబీల నుంచి మీడియా పాయింట్ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.
Also Read : Rahul Gandhi : వాణిజ్య లోటు గరిష్ట స్థాయికి చేరడం పై భగ్గుమన్న రాహుల్ గాంధీ