Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీతో భారీ ఊరట
ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు...
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ధన్యవాదాలు తెలిపారు.
Visakha Steel Plant Got Huge Funds..
‘‘విశాఖస్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’’ అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
కాగా..చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ కూడా ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామితో సమావేశమై స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల ప్రధాన మంత్రిని కలిసినప్పుడు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఆర్థిక సహాయం కావాలని చంద్రబాబు కోరారు.
దీనిపై విభిన్నకోణాల్లో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీని ఆమోదించింది. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాం 2023-24లో రూ. 4548.86 కోట్లు, అలాగే 2022-23లో రూ.2858.74 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ క్రమంలో వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడంతో ఈ పరిశ్రమకు నష్టాలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్‌పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్రకటనతో ముందడుగు పడినట్లైంది. ఈ ప్రకటనతో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ అంశం వెనక్కి వెళ్లిందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Also Read : CM Revanth Reddy : సింగపూర్ వెళ్లిన మొదటి రోజే భారీ ఒప్పందం