Delhi Elections 2025-Kejriwal : పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ మోదీకి లేఖ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరారు...
Kejriwal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారంనాడు లేఖ రాశారు. ఢిల్లీలోని పారిశుధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీపై భూమి కేటాయించాలని ఆ లేఖలో కోరారు. దీనిపై మీడియాతో కేజ్రీవాల్(Kejriwal) మాట్లాడుతూ, కేంద్రం భూమి కేటాయిస్తే ఢిల్లీ ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు ఇళ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.
Kejriwal Write a Letter to PM…
”పారిశుధ్య కార్మికులు మురికివాడల్లో నివసిస్తుండటం చూశాను. దీనిపై ప్రధానికి లేఖ రాశాను. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరారు. ఆ పథకం కింద సబ్సిడీతో భూములను కేంద్రం కేటాయిస్తే అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టించి ఇస్తుంది” అని కేజ్రీవాల్ తెలిపారు. తొలుత ఎన్డీఎంసీ, నిగం నగర్ పారిశుధ్య కార్మికులకు కేంద్రం భూమి కేటాయిస్తే, వారి వేతనాల నుంచి ఇన్స్టాల్మెంట్లుగా ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని చెప్పామని అన్నారు. ఇది పేద ప్రజలకు ఉద్దేశించిన పథకం అయినందున ప్రధాని అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత మిగితా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయవచ్చునని అన్నారు.
”ఎన్డీఎంసీ,ఎంసీడీ ఏరియాల్లో నివసిస్తున్న పారిశుధ్య కార్మికులకు సంబంధించి ప్రధాన అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నగర పరిశుభ్రతలో ఈ పారిశుధ్య కార్మికులు కీలకంగా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన నివాసాల్లో ఉంటారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఆ నివాసాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. వీరికి సొంతంగా ఇళ్లు కొనుక్కొనే స్తోమత కానీ, భారీ అద్దెలు చెల్లించగలిగే స్తోమత కానీ లేదు. భూములకు సంబంధించిన అంశం కేంద్ర పరిధిలోకి వస్తున్నందున, తగ్గింపు ధరలతో వారికి భూములు కేటాయించాలని కోరుతున్నాను. వారికిచ్చే ప్రభుత్వ జీతాల నుంచి ఇన్స్టాల్మెంట్స్గా ఆ మొత్తాన్ని కార్మికులు చెల్లిస్తారు. ఇందుకు సంబంధించిన పథకాన్ని ప్రారంభించి క్రమంగా దానిని ఇతర ఉద్యోగులకు కూడా విస్తరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ప్రతిపాదనను మీరు అంగీకరించి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తారని ఆశిస్తున్నాను” అని ప్రధానికి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read : Minister S Jaishankar : పాక్ పోషిస్తున్న ఉగ్రవాదం పై భగ్గుమన్న భారత విదేశాంగ మంత్రి