Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే ద్విసభ్య కమిటీ
ఘటనపై ఈ కమిటీ అత్యున్నత స్థాయి విచారణ జరుపుతుందని పేర్కొంది.,
Delhi Stampede : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలైంది. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ద్విసభ్య కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. నార్తరన్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గాంగ్వార్‌లతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై ఈ కమిటీ అత్యున్నత స్థాయి విచారణ జరుపుతుందని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రైల్వేస్టేషన్‌లోని వీడియా ఫుటేజ్‌లన్నీ భద్రం చేయాలని కమిటీ ఆదేశాలిచ్చింది.
Delhi Stampede Updates
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో(Kumbh Mela) పాల్గొనేందుకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు భారీ సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆహా దేవి (79), పింకీ దేవి (41), షీలా దేవి (50), వ్యోమ్ (25), పూనమ్ దేవి (40), లలితా దేవి (35), సురుచి (11), కృష్ణాదేవి (40), విజయ్ సహ్ (15), నీరజ్ (12), శాంతిదేవి (40) పూజ కుమార్ (8), సంగీత మాలిక్ (34), పునమ్ (34), మమతా ఝా (40), రియా సింగ్ (7), బేబీ కుమారి (24), మనోజ్ (47) ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తొక్కిసలాటఘటనపై విచారణకు ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED/IP) దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికులందరిని ప్రత్యేక రైళ్లలో పంపామని, రైళ్ల రాకపోకలు యథాప్రకారం కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read : నెట్టింట పరుగులు తీస్తున్న విజయవాడ మాజీ ఎంపీ వీడియోలు