Operation Kagar : కర్రెగుట్టలో భద్రతా బలగాలు, మావోల మధ్య కాల్పులు..28 మృతి
ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో..
Operation Kagar : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారి నుంచి భద్రాతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ వైపు జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో దాదాపు 8000 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు సమాచారం.
Operation Kagar, Chhattisgarh Encounter
గత కొన్ని రోజులుగా మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) కూడా అన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని ఏరిపారేయాలనే ఉద్దేశంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌ను(Operation Kagar) చేపట్టారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్లో తాజాగా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
అయితే భద్రత బలగాల ఆపరేషన్‌తో బెదిరిపోయిన మావోయిస్టులు.. కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో నిన్న ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని. ఒక నెల సైనిక చర్య వాయిదా వేసి చర్చలకు జరపాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో రాసుకొచ్చారు.
Also Read : United Nations-Pahalgam Attack : పహల్గమ్ ఉగ్రదాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి