క‌మ‌లం విక‌సించాలంటే క‌ష్ట‌ప‌డాల్సిందే

దేశ రాజ‌కీయాల‌లో ఒక ప్ర‌భంజ‌నంలా దూసుకు వ‌చ్చిన ఒకే ఒక్క‌డు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజీ. ఇది కాద‌న‌లేని స‌త్యం. సైద్ధాంతికంగా, భావ‌సారూప్యంగా చూస్తే భిన్న‌మైన అభిప్రాయాలు ఉండ‌టంలో త‌ప్పు లేదు. కేవ‌లం మ‌త ప్రాతిప‌దిక పేరుతో..హిందూ కార్డుతో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంటూ అంచెలంచెలుగా జాతీయ చిత్ర ప‌టంలో చోటు ద‌క్కించుకుంది. ఎన్నో ఒడిదుడుకులు..మ‌రెన్నో ఆటుపోట్లు..వెర‌సి అనూహ్య‌మైన విజ‌యాలు క‌మ‌ల ద‌ళంలో చోటు చేసుకున్నాయి. దీనికి కాల‌మే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం..కాద‌న‌లేని వాస్త‌వం కూడా. వందేళ్ల కాంగ్రెస్ పార్టీ ఓ వైపు..వామ‌ప‌క్షాలు, ప్ర‌తిప‌క్షాలు..ప్రాంతాల వారీగా పార్టీల ఆధిప‌త్యాన్ని దాటుకుని ఇవాళ బీజేపీ త‌నదైన ముద్ర‌ను వేసింది. బీజేపీ అంటేనే అద్వానీ, వాజ్‌పేయి..అతిర‌థ మ‌హార‌థులు ఆ పార్టీకి జీవం పోశారు. ఆ త‌ర్వాత సామాన్య చాయ్ వాలా నుంచి అత్యున్న‌త ..ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి వెన్నెముక అయిన ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ఘ‌న‌త ఒకే ఒక్క‌డికి ద‌క్కుతుంది.
అత‌నే మోదీజీ. ముఖ్య‌మంత్రిగా విజేత‌గా నిలిచిన ఈ చాయ్ వాలా ఇపుడు ప్ర‌పంచం త‌న వైపు చూసుకునేలా త‌నను తాను తీర్చిదిద్దుకున్నారు. మేడిన్ ఇండియా మేకిన్ ఇండియా..ఫ‌క్తు భార‌తీయ‌త ఆపాదించుకున్న ఈ భార‌తీయుడు ఇపుడు ప్ర‌తి రోజూ వార్త‌ల్లో ఉంటున్నారు. టెక్నాల‌జీ డామినేట్ చేస్తున్న త‌రుణంలో మోదీ ఒక ఉప్పెన‌లా ముందుకు వ‌చ్చాడు. ఆయ‌న‌కంటూ ఓ స్వంత టీం వుంది. అందులో ఆయ‌న వెనుక వ్యూహ‌క‌ర్త మాత్రం ఒక్క‌రే..అత‌డే అమిత్ షా. అత‌డు అడుగు పెడితే చాలు..చెక్ పెట్ట‌డ‌మో అవ‌త‌లి టీం..అదే ఏ పార్టీ అయినా..లేదా ఏ డైన‌మిక్ లీడ‌ర్ అయినా స‌రే స‌రెండ‌ర్ కావాల్సిందే. ప‌క్కా ప్లాన్..క‌ట్టుదిట్ట‌మైన ఐడియా..అనుకుంటే వ‌ర్క‌వుట్ కావాల్సిందే.
ఇదే స‌మ‌యంలో మోదీ, షా ద్వ‌యం ఇండియా అంత‌టా క‌మ‌లాన్ని విస్త‌రింప చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. రాబోయే జ‌మిలి ఎన్నిక‌ల్లో దేశ‌మంత‌టా కాషాయ జెండా ఎగుర వేయాల‌న్న‌ది వారి సంక‌ల్పం. ల‌క్ష్యం కూడా. వీరి టీంలో మ‌రో న‌మ్మ‌క‌మైన నేత ఉన్నారు అత‌నే యోగి ఆదిత్య‌నాథ్. ఇక దేశ‌మంతా ఒక ఎత్తు అయితే ద‌క్షిణాది రాష్ట్రాలు దేని క‌దే ప్ర‌త్యేక‌మైన‌వి. ఈ ప్రాంతాల‌లో ప్రాంతీయాభిమానం ఎక్కువ‌. ఎట్ట‌కేల‌కు క‌ర్నాట‌క‌లో కాషాయం పాగా వేసినా అటు త‌మిళ‌నాడు ఇటు ఏపీ, తెలంగాణ‌లో బ‌ల‌మైన శ‌క్తిగా ఎద‌గ‌లేక పోయింది. ఇదే క్ర‌మంలో ఇటీవ‌ల అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక‌టి త‌మిళ‌నాడు అయితే ఇంకోటి తెలంగాణ‌. ఇక్క‌డ బ‌ల‌మైన శ‌క్తిగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉన్న‌ది. ఇది ఉద్య‌మంతో ప్రారంభ‌మై ఫ‌క్తు శ‌క్తివంత‌మైన పార్టీగా బ‌ల‌ప‌డింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పాల‌న‌ను పంచుకున్నా ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌త్యేక తెలంగాణ నినాదం ఊపందుకుంది. అది ప్ర‌పంచానికి కొత్త పాఠం నేర్పింది.
ఆత్మాభిమానం, ఆత్మ త్యాగం, బ‌లిదానాల‌కు పెట్టింది పేరు ఈ ప్రాంతం. దీనిని మొద‌ట‌గా గుర్తించింది..దానిని ఒక ప్లాట్ ఫాం మీద‌కు తీసుకు వ‌చ్చింది మాత్రం ఒకే ఒక‌రు..ఆయ‌నే తెలంగాణ గాంధీగా కొలిచే ఆచార్య జ‌యశంక‌ర్ ఆచారి. వ‌న‌రుల‌ను గుర్తించి..శ‌క్తుల‌ను స‌మీక‌రించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసి..భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీలు, వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌ల‌ను ఒక చోటుకు చేర్చ‌డంలో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారు. ఆయ‌న వేసిన బాటలో కోట్లాది ప్ర‌జ‌లు అడుగులు వేశారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని సంత‌కంగా తెలంగాణ పోరాటం నిలిచి పోతుంది.
ఈ మ‌హ‌త్త‌ర నిర‌స‌న మిన్నంట‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఏపీ విడిపోయింది. తెలంగాణ ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత తెలంగాణ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ..దానిని ఓన్ చేసుకున్న పార్టీకి టీఆర్ ఎస్ పేరు తెచ్చుకుంది. దీంతో ఎన్నో ఆటు పోట్ల మ‌ధ్య టిఆర్ ఎస్ గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకును పొందింది. ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. కొత్త రాష్టం ఏర్పాటులో కొంత అనిశ్చితి ఏర్ప‌డింది. పుణ్య కాలం పూర్త‌యింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఆ పార్టీ ముందుకు వెళ్లింది. దాని అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పు కాద‌ని తేలింది. బంప‌ర్ మెజారిటీని ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణం, న‌గ‌ర స్థాయి వ‌ర‌కు ప్ర‌తి చోటా గులాబీ రెప‌రెప‌లాడింది. ఆక‌ట్టుకునే మేనిఫెస్టోతో ..తాయిలాలు..సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప్ర‌జాస్వామ్యం లో ప్ర‌తిప‌క్షం అన్న‌ది బ‌లంగా ఉండాలి. కానీ తెలంగాణ‌లో ఆ పాత్ర‌ను ఏ ప్ర‌తిప‌క్షం పోషించ‌లేని స్థితికి చేరుకుంది. వాటిని నిర్వీర్య ప‌ర్చ‌డంలో ప‌వ‌ర్ లో ఉన్న పార్టీ
స‌క్సెస్ అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు.
మొద‌టిసారి కంటే రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక తాము ఏది చెబితే అదే చ‌ట్టం అన్న స్థితికి చేరుకుంది. బంధుప్రీతి, అశ్రిత‌ప‌క్ష‌పాతం, ఒకే కుటుంబం ఆధిప‌త్యం ..వెర‌సి నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరును నిత్యం జ‌పించి చివ‌ర‌కు అణచివేత‌కు దిగ‌డం..త‌మ‌కు ఎదురే లేద‌న్న సాకుతో వేధింపుల‌కు గురి చేయ‌డంతో ప్ర‌జ‌లు విసిగి వేసారి పోయారు. ఇదే క్ర‌మంలో సీఎం కూతురు ఓడి పోవ‌డం, దుబ్బాక‌లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డేలా చేశారు ఓట‌ర్లు. నోట్ల‌కు ఓట్లు రాలుతాయ‌న్న భ్ర‌మ‌లో ఉన్న నేత‌ల‌కు ఇది మింగుడు ప‌డ‌ని అంశం. ఒన్ మెన్ ఆర్మీ లాగా దూకుడు మీదున్న కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్, సంతోష్, క‌విత‌ల‌కు..వారి అనుయాయుల‌కు కోలుకోలేని షాక్. గ‌తంలో కంటే మెరుగైన ఓటు బ్యాంకును చేజిక్కించుకుని గులాబీకి ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైంది బీజేపీ. మెత‌క వైఖ‌రి నాయ‌క‌త్వం క‌లిగిన క‌మ‌లానికి అమిత్ షా కొత్తగా బండి సంజయ్ రూపంలో ఆక్సిజ‌న్ ఎక్కించారు.
యూత్ వింగ్ కే ప్ర‌యారిటీ ఇస్తూ..ఇష్యూస్ మీదే ఫోక‌స్ పెట్టేలా చేశారు. కోర్ క‌మిటీని ఏర్పాటు చేసి..జ‌న ఆక‌ర్ష్ ను వ‌ర్క‌వుట్ అయ్యేలా ప్లాన్ చేశారు. ప్ర‌జ‌ల్లో బ‌లంగా పాతుకు పోయిన గులాబీ రెక్క‌లు విరియాలంటే ముందు అన్ని శ‌క్తుల‌ను ఒకే వేదిక‌కు తీసుకు వ‌చ్చేలా చేశారు. అధికార పార్టీకి మూల స్తంభాలైన మై హోం, మేఘా, త‌దిత‌ర వాటి మూలాల‌ను దెబ్బ కొట్టే ప‌నిలో ప‌డిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. తెలంగాణ‌లో త‌మ‌ను ఢీకొన‌డం ఎవ‌రి త‌రం కాద‌ని అనుకున్న వాళ్లకు నిద్ర లేకుండా చేసింది బీజేపీ. ఎలాగైనా స‌రే 2023లో తెలంగాణ‌లో కాషాయ జెండా ఎగుర వేయాల‌న్న‌ది దాని టార్గెట్. ఏ పార్టీకి లేన‌టువంటి క్యాడ‌ర్, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు బీజేపీకి ఉన్నారు. వీళ్లంతా అమ్ముడుపోని వాళ్లే. ఇదే ఇపుడు ఆపార్టీకి ప్ల‌స్ పాయింట్.
తెలంగాణ‌లో కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నిక‌లో ఎలాగైనా స‌రే త‌మ స‌త్తా చాటాల‌ని చూస్తోంది క‌మ‌ల క‌మాండ్. భారీ విజ‌న్ తో పాటు అశేష‌మైన విష‌య ప‌రిజ్ఞానం క‌లిగిన వ్య‌క్తిగా..సీఎంగా ..నాయ‌కుడిగా..క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు పేరుంది. అధికారం కోసం అవ‌స‌ర‌మైతే ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉంటారు. పవ‌ర్ కోసం ప్ర‌జ‌ల ..రాష్ట్ర అవ‌స‌రాల‌కు ఏ పార్టీతో క‌లిస్తే త‌ప్పేముంద‌న్న వాద‌న ఆయ‌న‌ది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఇరు రాష్ట్రాల్లో తేలిపోయింది. దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లి ఓట్లుగా మ‌ల్చుకోవ‌డంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇదే క్ర‌మంలో బీజేపీ మ‌రింత దూకుడు పెంచింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరుతో ..ఏక వ్య‌క్తి ..కుటుంబ పాల‌న కొన‌సాగిస్తూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను..ఆలోచ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా..స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించకుండా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో కాల‌యాప‌న చేస్తూ.. వ‌స్తున్న కేసీఆర్ అండ్ టీంకు గుణ‌పాఠం చెప్పాల‌ని క‌మ‌లం డిసైడ్ అయ్యింది. మ‌రి ..మేరు ప‌ర్వ‌త శిఖ‌రాన చేరుకున్న ఆ పార్టీని ఢీకొనాలంటే రాబోయే మూడేళ్లు క‌మ‌లం చాలా వ‌ర్కు చేయాల్సి ఉంది.
గ్రామ, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వ్య‌క్తుల‌ను ఇప్ప‌టి నుంచే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏ నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో అధికారంలోకి వ‌చ్చిందో ముందు దానిపైనే దృష్టి పెట్టాలి. తెలంగాణ‌కు వున్న వ‌న‌రులు ఏమిటి. వాటిని ఎలా వినియోగించు కోవాలి. ఆదాయం పెంచుకోవ‌డం, స‌మాజాన్ని తీవ్ర ప్ర‌భావం చూపించే నిరుద్యోగులకు ఎలాంటి భ‌రోసా క‌ల్పిస్తారో చూపాలి. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కొంత మేర‌కు మాత్ర‌మే ప‌ని చేస్తాయి. కానీ ఎళ్ల‌కాలం పూర్తి వ్య‌తిరేక‌త‌ను క‌లుగ చేస్తుంది. మేధావులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, క‌ర్ష‌కులు, కార్మికులు, పారిశ్రామిక‌వేత్త‌లు, వివిధ పార్టీల రాజ‌కీయ నాయ‌కులు, భావ‌సారూప్య‌త క‌లిగిన బుద్ధి జీవుల‌తో అనుసంధానం కావాలి. ఏం చేస్తున్నామో..ఏం చేయ‌గ‌ల‌మో ప్ర‌జ‌ల‌కు ఆమోద యోగ్యంగా..అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా మేనిఫెస్టో త‌యారు చేయాలి. ప్ర‌వాస తెలంగాణ ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేయాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే సామాజిక వ‌ర్గానికి అధిక ప్రాధాన్య‌త ఉండేద‌న్న అప‌వాదును క‌మ‌లం చెరిపి వేయాలి.
78 శాతానికి పైగా ఉన్న బ‌హుజ‌నులను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందు కోసం పెద్ద ఎత్తున గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తే కొంత ప్ర‌యోజ‌నం ఉంటుంది. స‌మ‌స్య‌లు. స‌వాళ్లు..ప‌రిష్కారాలు..వీటి మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాలి. ఇప్ప‌టి నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా ఎంపిక చేసి ..వారికి పూర్తి భ‌రోసా ఇస్తూ ఆర్థిక స‌హ‌కారం అంద‌జేయ‌డం. అధికార పార్టీ ఆగ‌డాలను ఎదుర్కునేలా ..ప్ర‌జ‌ల‌తో ఎళ్ల‌వేళ‌లా అందుబాటులో ఉండేలా చూడాలి. ఇందు కోసం సోష‌ల్, డిజిట‌ల్ మీడియాను ఉప‌యోగించు కోవాలి. అంతే కాకుండా రెండు మూడు ఛాన‌ల్స్ తో పాటు ప‌త్రిక‌ల‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్ర‌తి చోటా హెల్ప్ లైన్ ల‌ను ఏర్పాటు చేయాలి. ప్ర‌తి చోటా స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించి అంద‌రి అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. అధికార పార్టీ అవినీతి, అక్ర‌మాల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి. అప్పుడే క‌మ‌లం క‌ల నెర‌వేరుతుంది. లేక‌పోతే ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంది.

 

No comment allowed please