#VidyaKanuka : ప్రతీ పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలి

ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా ‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభం

ఆంధ్ర రాష్ట్రంలో 34 శాతం నిరక్షరాస్యత ఉండటానికి కారణం..గత ప్రభుత్వాల వైఫల్యమేనని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ‘జగనన్న విద్యా కానుక ’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తల్లిదండ్రులు పగలు రాత్రి కష్టపడుతూ తమ పిల్లలకి మంచి చదువు చెప్పించాలని అనుకున్నా.. వారు బడి మధ్యలోనే మానేస్తున్నారని అన్నారు. అందుకు ముఖ్య కారణం పాఠశాలల్లో సౌకర్యాలు, చదువుకునే పుస్తకాలు లేకపోవడమే కారణమని అన్నారు. అందుకే ఆ రెండింటిని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది..అందుకోసం 650 కోట్లతో కిట్లను కొనుగోలు చేసినట్టు తెలిపారు. అందులో పిల్లలకు యూనిఫామ్స్, షూలు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్సులు ఇలా అన్నీ కలిపి ఒక కిట్ గా ఉంటాయని తెలిపారు. పేద పిల్లలు కూడా ఇంగ్లీషు కాన్వెంటు స్కూలు పిల్లల్లాగే దర్జాగా బడికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

అలాగే విద్యతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, యువతతోనే దేశ భవిత అని నమ్మి..చిన్ననాటి నుంచి వారికి పునాది ఏర్పాటు చేయాలని భావించి ఇంకా 8 రకాల సంక్షేమ విద్యా పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేసే నాడు-నేడు ఒకటని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Leave A Reply

Your Email Id will not be published!