Palamuru : పాలమూరు జిల్లా ప్రసిద్ధ కవులకు, కళాకారులకు నిలయమని సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బోగ కోదండపాణి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో గల సావరీన్ కార్యాలయంలోసంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రముఖ పాలమూరు కవి దివంగత బోగ అంబయ్య స్మారక సాహిత్య, కళారంగ పురస్కారాలను పలువురు పాలమూరు జిల్లా కళాకారులకు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బోగ కోదండపాణి మాట్లాడుతూ మన సాహిత్య, సాంస్కృతికరంగం బాగుపడాలంటే సాంప్రదాయ కళలను బతికించుకోవాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కవులు, రచయితలు, నటులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారని వారిని ప్రోత్సహించడానికి తమ సంస్థ ఎల్లవేళలా ఉంటుందన్నారు.
సంస్థ చైర్మన్ సుల్తాన్ పాషా మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించామని, భవిష్యత్తులో కూడా అనేక రకాలైన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామన్నారు.
అనంతరం బోగ అంబయ్య స్మారక సాహిత్య, సాంస్కృతిక పురస్కారాలను ప్రముఖ కవులు కె.లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ చిక్కా హరీష్ కుమార్, నటులు వి.నారాయణ లకు, భూత్పూర్ దశరథ్ స్మారక ఫ్రెండ్లీ పోలీసు పురస్కరాన్ని ప్రముఖ కవి రంగినేని మన్మోహన్ కు అందజేశారు. పురస్కార గ్రహీతలకు శాలువా, మెమెంటోలతో పాటు నగదు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ విజయకుమార్, ప్రముఖ రంగస్థల నటులు బెల్లం సాయిలు, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సృజామి, సావరీన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
No comment allowed please