C Narayana Reddy: సినారె
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె)
C Narayana Reddy : సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 – జూన్ 12, 2017): సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం, హనుమాజిపేటలో జన్మించారు. చిన్నతనం నుంచే జానపదాలు, బుర్రకథలు, హరికథలు ఇష్టపడిన సినారె పదవ తరగతి నుండే పద్యాలు రాయడం ప్రారంభించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో ‘జనశక్తి’ అనే పత్రికలో సినారె కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సాహితీ సంచిక – ‘శోభ’కు సంపాదకత్వం నిర్వహించారు. ‘శోభ’పత్రికలో నారాయణరెడ్డిగారు ‘రోచిస్’, ‘సింహేంద్ర’ అనే మారుపేర్లతో రచనలు చేసేవారు. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్యనాటికలు ‘భలేశిష్యులు’ వంటి సాంఘిక నాటికలను సినారె రచించడమే కాదు తామూ పాత్రధారణ చేసి ప్రదర్శించారు కూడా.
C Narayana Reddy – సినీ గీత రచయితగా
నారాయణరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే 1962లో శ్రీ నందమూరి తారక రామారావుగారి ఆహ్వానంపై చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. సినారె రచించిన తొలి సినీ గీతం ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ‘‘నన్ను దోచుకొందువటే’’. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి ఇటీవలి ‘అరుంధతి’ సినిమాల వరకు మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. శంకర్ జయకిషన్, సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, రవీంద్రజైన్, ఉషాఖన్నా, బప్పీలహరి వంటి ఇతర భాషా సంగీత దర్శకులతో పాటు 50 సంగీత దర్శకులతో కలిసి సినారె పనిచేసారు. ఘంటసాల గళంలో నారాయణరెడ్డి(C Narayana Reddy) గీతాలధికంగా వచ్చాయి. నారాయణరెడ్డి మూగజీవులు, శభాష్ పాపన్న, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర చిత్రాలలో కావ్యసంబంధమైన పాత్రలలో కనిపించారు.
కవిగా
సామాజిక చైతన్య ప్రబోధాన్ని తన కవిత్వ ప్రధాన లక్ష్యంగా చేసికొని, ప్రగతిశీల మానవతావాదంతో ఆనాటి ‘‘నవ్వని పువ్వు’’ (1953) మొదలుకొని, ఈనాటి – ‘అలలెత్తే అడుగులు’ (2013), నింగికెగిరే చెట్లు (2014) వరకు 18 ప్రక్రియలలో సుమారు 90 గ్రంథాలు రచించారు. విశ్వంభర, కర్పూర వసంతరాయలు, మనిషి – చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం ముఖ్యమైనవి. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం సినారెను పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులతో సత్కరించగా ఆంధ్రా యూనివర్సిటీ అతనికి కళాప్రపూర్ణ అనే బిరుదును అందజేసింది.
రాజ్యసభ సభ్యునిగా
రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే భారత రాష్ట్రపతి సినారె ను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసారు. దక్షిణ భారతదేశం నుండి రాజ్యసభ సభ్యులుగా నియమింపబడిన ప్రథమకవి నారాయణరెడ్డి(C Narayana Reddy) కావడం విశేషం. రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్న సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో గాంధీజీ చదివిన ఆల్ ఫ్రెడ్ హైస్కూల్ దుస్థితి, ఒరిస్సా రాష్ట్రంలోని ‘కటక్’లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ‘జానకీనాథ్ భవనం’ దుఃస్థితిని, జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య ఇంటిని పశువులపాకగా వాడుతున్నారు అనే విషయాన్ని సభలో ప్రస్తావించడంతో పాటు ఆమా భవనాల అధునికీకరణకు తన ఎంపి లాడ్స్ నుండి నిధులు కూడా విడుదల చేసారు.
Also Read : G Kishan Reddy : కమీషన్ల కోసం కాళేశ్వరం