Charles Philip Brown : తెలుగు భాషా వైభవం బ్రౌన్ స్మృతి పథం
బ్రౌన్ దేవుడిచ్చిన వరం తెలుగు జాతి పుణ్యం
Charles Philip Brown: సూర్య చంద్రులు ఉన్నంత కాలం..తెలుగు వారి లోగిళ్లలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నిలిచి ఉంటారు. తెలుగు వారందరికీ ఆయన ప్రాతః స్మరణీయుడు. ఎందుకంటే తెలుగు భాషను బతికించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత మానవుడు. భాషా ప్రేమికుడు.
సి పి బ్రౌన్ కృషి
తెలుగు వారై ఉండి భాషను, సంస్కృతిని, నాగరికతను మరిచి పోతున్న ప్రస్తుత తరుణంలో సీపీ బ్రౌన్ ఆంగ్లేయుడై ఉండి తెలుగు భాషలోని గొప్పదనాన్ని గుర్తించాడు. అంతకంటే తానే తెలుగై ప్రతి చోటా వినిపించేలా చేశాడు. తన జీవిత కాలమంతా తెలుగు కోసం ఆక్రోశించిన వ్యక్తి. ఇంతలా మధన పడిన వాడు, కృషి చేసిన వాడు తెలుగు భాషా ప్రస్థానంలో భూతద్దం పెట్టి వెతికినా దొరకరు.
ఆయన తెలుగు భాషకు ఉన్న సౌలభ్యాన్ని, మాధుర్యాన్ని, అందులోని తాత్వికతను, జీవితపు సారాన్ని గుర్తించాడు. ఆస్వాదించాడు. వాటిని పది మందికి పంచాలని అనుకున్నాడు. అందుకే ఆయనను తెలుగు జాతికి దేవుడు ఇచ్చిన ఓ బహుమతి. ఓ జీవగర్ర కూడా అని చెప్పక తప్పదు.
నవంబర్ 10, 1798 – చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (Charles Philip Brown) పుట్టిన రోజు. కోల్ కత్తాలో పుట్టారు. తెలుగు జాతి ఇద్దరికి రుణపడి ఉంది. ఒకరు కాటన్ దొర..మరొకరు బ్రౌన్ దొర. ఈ ఇద్దరూ విదేశీయులే. కానీ తెలుగు వారికి ప్రాణపదమయ్యారు. ఇక సీపీ బ్రౌన్ తండ్రి ఆల్డీన్ డేవిడ్ , తల్లి కౌలే.
బ్రౌన్ తెలుగు సాహిత్యానికి విశేషమైన రీతిలో కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఒక రకంగా బ్రౌన్ దొరను (Charles Philip Brown) సాహితీ పిపాసకుడు అని చెప్పవచ్చు. భాషకు సంబంధించి తొలి తెలుగు శబ్ద కోశమును ప్రచురించాడు. ఇవాల్టికి కూడా ఆయన తయారు చేసిన బ్రౌన్ డిక్షనరీని తెలుగులో ప్రామాణికంగా నేటికీ ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ ను స్మరించు కుంటన్నారు. అందుకే సీపీ బ్రౌన్ ను ఆంధ్ర భాషోద్దారకుడు అని కూడా పిలుచుకుంటారు.
ఓ వైపు అష్ట కష్టాలు పడి నిఘంటువును ప్రచురించిన బ్రౌన్ .. ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా పెద కోమటి వేమారెడ్డి అలియాస్ వేమన పద్యాలను వెలుగులోకి తీసుకు వచ్చిన ఘనత సీపీ బ్రౌన్ దే. ఎక్కడెక్కడో ఉన్న వేమన పద్యాలను ఏరి కోరి సేకరించాడు. వాటిని ప్రచురించాడు. అంతే కాదు ఆంగ్లంలోకి తానే అనువాదం చేసి దేశాలను దాటించాడు. తెలుగు భాషకు కీర్తి శిఖరాలను అందుకునేలా చేశాడు బ్రౌన్ దొర (Charles Philip Brown).
బాల్యం
ఇక బ్రౌన్ తండ్రి క్రైస్తవ విధ్వాంసుడు. ఇదే ఆయనకు చిన్నతనం నుంచే అబ్బింది. తండ్రి ఇచ్చిన సహకారం, స్పూర్తితో గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కోల్ కతాలోనే వీటిని అవపోసన పట్టాడు. హిందూస్థానీ భాష కూడా నేర్చుకున్నారు. 1817లో ఆగస్టు 4న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరాడు.
ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మదరాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగు భాషలో ప్రాథమిక జ్ఞానం పొందాడు. వేమన, సుమతీ శతకాలను కంఠతః పట్టాడు. తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో, ఇతిహాసాలతో, కావ్యాలతో సుసంపన్నం చేసిన నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన, రామరాజ భూషణడులను అవగాహన చేసుకున్నాడు. వారందరికి సంబంధించిన కృతులను పరిష్కరించి ప్రచురించాడు సీపీ బ్రౌన్.
ఇదే సమయంలో 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టర్ గా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో తిరగడంతో భాష అవరోధంగా మారింది. దీంతో తెలుగులో తప్పనిసరిగా మాట్లాడడం అవసరమైంది. దీనిని నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు సీపీ బ్రౌన్ (Charles Philip Brown). దీనిని గమనించారు బ్రౌన్ దొర. సులభమైన, శాస్త్రీయమైన విధానాన్ని లేకపోవడం గుర్తించాడు.
ఆనాడు సంస్కృతంలోనే ఎక్కువగా వాడకం ఉండేది. పండితులు తమకు తోచిన రీతిలో బోధిస్తూ ఉండడంతో తట్టుకోలేక పోయాడు. ప్రధానంగా తెలుగేతరులకు మరింత ఇబ్బందికరంగా మారింది. తెలుగు భాషను ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే ఆయనను భాషా ప్రేమికుడిగా, పరిశోధకుడిగా మారేలా చేసింది. ప్రాచీన కావ్యాలను వెలికి తీయడం ప్రారంభించాడు. ప్రజలందరికీ ప్రధానంగా సామాన్యులకు అర్థం అయ్యేలా ఉండేలా కృషి చేశాడు. అంతే కాదు వాటిని ప్రచురించేందుకు కంకణం కట్టుకున్నాడు. తెలుగు భాషకు ప్రాణ ప్రదమైన వ్యాకరణం, నిఘంటువును తయారు చేశాడు బ్రౌన్ దొర(Charles Philip Brown).
ఇదే సమయంలో వృత్తి రీత్యా మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి తదితర చోట్ల పని చేశాడు. 1826లో తిరిగి కడపకు వచ్చాడు. అక్కడే స్థిర నివాసం ఏర్పర్చకున్నాడు. అక్కడ ఓ ఇల్లు కొన్నాడు. సొంత డబ్బులతో తానే పండితులను నియమించాడు. తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు సీపీ బ్రౌన్. ఆయనకు తోడుగా అయోధ్యాపురం కృష్ణా రెడ్డి సహాయకుడిగా ఉన్నాడు చివరి దాకా.
సామాజిక సంస్కరణ
భాషను బతికించడమే కాదు కడప, మచిలీపట్నంలో బడులు ఏర్పాటు చేశాడు. ఉచితంగా చదువు చెప్పించిన మహోన్నత మానవుడు బ్రౌన్ దొర. అంతే కాదు విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కల్పించిన ఘనత కూడా ఆయనదే. అడిగిన వారిని కాదనలేదు. దానగుణం కలిగిన మహోన్నత వ్యక్తి గా పేరొందాడు. వికలాంగులను చేరదీశాడు.
ఒకానొక దశలో పండితులకు ఇచ్చే జీతాలు, పుస్తకాల ప్రచురణ కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. చివరకు అప్పులు కూడా చేశాడు. ఇదే సమయంలో 1834లో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్ కు వెళ్లాడు. 1837లో పర్షియన్ అనువాదకుడిగా ఇండియాకు వచ్చాడు సీపీ బ్రౌన్. 1832-1833లో గుంటూరు కరువు వచ్చింది. ప్రజలకు దగ్గరుండి సేవలు అందించాడు. ఒక రకంగా తానే దైవమై ఆదుకున్నాడు.
ప్రచురణలు
1825 నాటికి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తెలుగు భాషకు జీవం పోసిన అరుదైన సాహితీ ప్రేమికుడు..పిపాసకుడు సీపీ బ్రౌన్. సంస్కృత భాష మీద పట్టున్న బ్రౌన్ 1827 నాటికి ఆంధ్ర గీర్వాణ ఛందము అనే పేరుతో పుస్తకాన్ని రాశాడు. కానీ ఆయనకు ఎక్కువగా గుర్తింపు తీసుకు వచ్చింది మాత్రం 1829లో తీసుకు వచ్చిన వేమన శతకం.
వేమారెడ్డి సాహిత్యాన్ని సీపీ బ్రౌన్ ఒకటి కాదు రెండు ఏకంగా ఐదేళ్ల పాటు అధ్యయనం చేశాడు. 700 పద్యాలకు ఆంగ్లంలో అనువాదం చేశాడు. ఇందుకు సంబంధించి ప్రతి పదానికి పదకోశం కూడా సమకూర్చి పెట్టిన ఘనత బ్రౌన్ దొరదే. పదేళ్ల అనంతరం మరికొన్ని పద్యాలను చేర్చాడు. మొత్తం 1164 వేమన పద్యాలను చేర్చి తిరిగి వేమన శతకం అచ్చు వేసిన సాహితీ వేత్త.
24 తాతాచారి కథలను 1855లో పుస్తకంగా ముద్రించారు. వీటిని పాపులర్ తెలుగు టేల్స్ పేరుతో ముద్రించాడు. సీపీ బ్రౌన్ కు (Charles Philip Brown) తెలుగులో తొలి యాత్రా చరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో పరిచయం ఏర్పడింది. 1841లో నల చరిత్రను, ఆంధ్ర మహా భారతం, శ్రీమద్భాగవతము ప్రచురించాడు.
ఆంగ్లేయుల కోసం వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాశాడు బ్రౌన్ (Charles Philip Brown). 1840లో వ్యాకరణాన్ని ముద్రించాడు. లండన్ లోని ఇండియా హౌస్ లైబ్రరీలో పడి ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసుకు తెప్పించాడు బ్రౌన్. హరిశ్చంద్రుని కష్టాలు పేరుతో గౌరన మంత్రిచే వ్యాఖ్యానం రాయించి 1842లో ప్రచురించాడు.
1844లో వసు చరిత్ ,1851లో మను చరిత్ర ను ప్రచురించాడు. వీటికి జూలూరి అప్పయ్య శాస్త్రి తో వ్యాఖ్యానాలు రాయించాడు.1852లో పలనాటి వీరచరిత్రను ప్రచురించాడు. ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. 1827లో ఆంధ్ర గీర్వాణ చందము ను, శుభ వర్తమానం, బైబిల్ కథల తెలుగు అనువాదం ప్రచురించిన ఘనత బ్రౌన్ దే. రాజుల యుద్దాలు, అనంతపురం ప్రాంత చరిత్రను ప్రచురించారు.
తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు 1852లో , ఇంగ్లీష్ తెలుగు 1854లో, మిశ్ర భాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ పేరుతో ప్రచురించాడు. 1840లో తెలుగు వ్యాకరణం ప్రచురించిన మహానుభావుడు.
శేష జీవితం
1854లో లండన్ లో స్థిరపడ్డాడు. 1865లో లండన్ యూనివర్శిటీలో తెలుగు ప్రొఫెసర్ గా నియమితుడయ్యాడు. జీవితకాలమంతా తెలుగు భాష కోసం పని చేశాడు. ఆ మహోన్నత మానవుడు ఇక సెలవంటూ 1884 డిసెంబర్ 12న కిల్డారే గార్డెన్స్ లోని తన ఇంట్లో కన్ను మూశాడు. కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు. శాశ్వతంగా..ప్రశాంతంగా నిద్ర పోయారు బ్రౌన్ దొర (Charles Philip Brown).
సీపీ బ్రౌన్ (Charles Philip Brown) చేసిన కృషికి చిహ్నంగా కడపలో ఆయన నివసించిన భవంతి స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, ప్రజల నిధుల సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించారు. 2006 నవంబర్ 10న భాషా పరిశోధన కేంద్రంగా యోగి వేమన విశ్వ విద్యాలయంలో భాగమైంది.
ఆ మహోన్నత మానవుడికి ఏబీసీడీ మీడియా నివాళి అర్పిస్తోంది. తెలుగు ఇజం స్మరిస్తోంది.
Also read: తెలుగు భాషకు ఆద్యుడు గిడుగు