Congress : నేడు తెలంగాణ గాంధీ భవన్ లో కులగణనపై కీలక సమావేశం
కాగా కుల గణనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది...
Congress : టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ బేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు. ఇంకా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నేతలు తదితరులు హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా కులగణనపై చర్చ జరగనుంది. నవంబర్ 4వ తేదీ నుంచి రాష్ట్రంలో కుల గణన(Caste Census) ప్రక్రియ చేపట్టాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ సమావేశంలో పార్టీ కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Congress Meeting..
కాగా కుల గణన(Case Census)కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోగల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టనున్నది. వచ్చేనెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించనున్నారు. ఈమేరకు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ సర్వే కోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించనున్నారు. ఒక ఎన్యూమనరేటర్ పరిధిని ఒక బ్లాక్‌గా నిర్ణయించారు. పది బ్లాక్‌లకు కలిసి ఒక సూపర్‌వైజర్‌ను నియమించనున్నారు. వీరందరికీ సర్వే ఎలా చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జిల్లా ప్రణాళిక అధికారి సహ పలువురు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నారు.
ఈ శిక్షణ బుధవారం నాటికి పూర్తి కానున్నది. దీపావళి పండుగ అనంతరం జిల్లాలో సర్వే చేసేందుకు ఎంపిక చేసిన ఎన్యూమరేటర్లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు మొత్తం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అంతకంటే ముందుకుగా సర్వే పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వే చేపట్టే ఎన్యూమరేటర్ల కోసం స్థానిక సంస్థల కలెక్టర్ ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. పంచాయతీ శాఖతో పాటు, రెవెన్యూ, తదితర శాఖలకు చెందిన సిబ్బందిని ఈ సర్వే కోసం వినియోగించుకోనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,95,332 మంది జనాభా ఉండగా, ఇందులో పురుషులు 3,99,325 మంది, మహిళలు 3,96,006 మంది ఉన్నారు. కుటుంబాలు 2,09,677 ఉన్నాయి.
జనాభా లెక్కలు నిర్వహించి 13 ఏళ్లు పూర్తవుతున్నది. గడిచిన ఈ పదమూడేళ్లలో జనాభా 9 లక్షలకు, కుటుంబాల సంఖ్య 3 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించి సర్వే చేయించనుండగా, ఆ లెక్కన జిల్లాలో 1400 నుంచి 1450 మంది వరకు ఎన్యూమరేటర్లను నియమించాల్సి ఉంటుంది. 150 మంది వరకు సూపర్‌వైజర్లను నియమించనున్నారు. సర్వేచేసిన వివరాలను ఏ రోజుకారోజు సూపర్‌వైజర్లకు అందిస్తే వాళ్లు కంప్య్టూటర్లలో నమోదు చేయించనున్నారు. తాత్కాలికంగా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా నియమించనున్నారు. ఈ సర్వేను పర్యవేక్షించేందుకు ఒక జిల్లా స్థాయి అధికారిని ఒక్కో మండలానికి నోడల్ అధికారిగా నియమించనున్నారు.
కుల గణన(Caste Census) సర్వేను మాన్యువల్‌గానే నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్ట్ 1, పార్ట్ 2లో 75 ప్రశ్నలను రూపొందించారు. ఈ సర్వే ఫారం మొత్తం 7 పేజీల్లో ఉండనున్నది. పార్ట్ 1లో 58 ప్రశ్నలు ఉండనున్నాయి. కుటుంబ యజమాని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయనున్నారు. మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులం, మాతృభాష, వయసు, వైవాహిక పరిస్థితి, పాఠశాల వివరాలు, విద్యార్హతలు, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటీ రిటర్న్స్, స్థిరాస్తులు, ధరణి పాస్ బుక్ నంబర్, రిజర్వేషన్ల వల్ల పొందిన ప్రయోజనాలు, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలు, తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
పార్ట్ 2లో 17 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో కుటుంబ వివరాలను నమోదు చేయనున్నారు. తీసుకున్న రుణాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి, రేషన్ కార్డు నంబర్, గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ నంబర్, తదితర వివరాలను నమోదు చేయనున్నారు ఈ సర్వే ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, ఉద్య్గోగ, ఉపాధి అవకాశాలపై ఒక అవగాహన రానున్నది. సర్వే ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను తీసుకరానున్నది. రాజకీయంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ సర్వే పూర్తయితేనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే జనవరి నెలాఖరుతో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగియనున్నందున ఆ ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. బీసీ కులగణన చేపట్టనిదే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో పాటు బీసీ సంఘాలు సైతం డిమాండ్ చేశాయి. హైకోర్టు కూడా బీసీ గణన అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు కుల గణన(Caste Census)కు అధికార యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నది.
Also Read : TMC MP : బాటిల్ పగలగొట్టడం పై వివరణ ఇచ్చిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ