Gurajada Apparao : మహాకవి జీవిత విశేషాలు

మహాకవి గురజాడ అప్పారావు జీవిత విశేషాలు

Gurajada Apparao : గురజాడ వెంకట అప్పారావు (1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30): తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరు. ఒక రచయితగా, సంఘ సంస్కర్తగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా గురజాడ చేసిన రచనలు నేటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

 

Gurajada Apparao – గురజాడ రచనా ప్రస్థానం

 

విశాఖలో పుట్టినప్పటికీ విజయనగరం పూసపాటి రాజవంశీయుల సంస్థానంలో పనిచేయడంతో గురజాడకు విజయనగరానికి విడదీయరాని బంధం ఏర్పడింది. గురజాడ(Gurajada Apparao) రచించిన కన్యాశుల్కం నాటకం సాహితీలోకంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని సాంఘీక నాటకం రూపంలో ఫొటో తీసి గురజాడ సమాజం ముందుంచాడు.

ఈ నాటకంలో గురజాడ(Gurajada) సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కన్యాశుల్కం రెండు కూర్పులుగా ప్రచురించగా మొదటి కూర్పు 1897లో ప్రచురించబడగా మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరం లో జరిగింది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

 

గురజాడ ఇతర రచనలు

 

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్నా… అనే సుప్రసిద్ధ గేయాలు గురజాడ కలం నుండి జాలువారిన గేయాలే…. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడిగా ఉన్న గురజాడ అభ్యుదయ మహాకవి, కవితా పితామహుడు, కవి శేఖర వంటి బిరుదులు పొందారు. 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన ప్రాణ స్నేహితుడు గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి.

1889లో విజయనగరంలో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో తమ్ముడు శ్యామలరావుతో కలిసి గురజాడ ఆంగ్లంలో పద్యాలు రాసారు. గురజాడ(Gurajada) రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్ (Indian leisure hour) చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నాడు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని గురజాడను ప్రోత్సహించారు.

 

విజయనగరం సంస్థానంలో గురజాడ ప్రస్థానం

 

1886 లో విజయనగరం డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్‌ క్లర్కు గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన గురజాడ అనతి కాలంలోనే మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా, మహారాజ కళాశాలలో అధ్యాపకునిగా, సంస్థాన శాసన పరిశోధకునిగా, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా ఎదిగారు. ఆ తరువాత 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం గురజాడను బోర్డు అఫ్ స్టడీస్ లో నియమించింది. దీనితో అదే సంవత్సరంలో, తన స్నేహితులతో కలిసి గురజాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించాడు. 1913లో పదవీ విరమణ చేసిన గురజాడ అప్పారావు అప్పటినుండి అనారోగ్యంతో బాధపడ్డారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు “ఫెలో” తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 న గురజాడ అప్పారావు హస్తమించారు.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు

 

 

Leave A Reply

Your Email Id will not be published!