#TeluguLegend : సాటిలేని మేటి.. విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి

January 27 ... Viswanatha Jagannadha Ghanapathi Birthday

ఆయన కంఠస్వరం సుమధురమైంది. స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఆయన కంఠంలో ఒదిగి పోయింది. వేదవాఙ్మయ ఔన్నత్యాన్ని సుస్వరంగా  , లయబద్దంగా విశ్వానికి వ్యక్తీకరించిన సనాతన సాంప్రదాయ ప్రతీక ఆయన. నిత్య ప్రాతః స్మరణం చేసుకోవాల్సిన మహానుభావుడు, మహా పురుషుడు.
“వేదం వింటే విధాత సమక్షంలో వినాలి, లేదంటే బ్రహ్మశ్రీ జగన్నాధ ఘనపాఠి నోట వినాలి” అంటూ శ్రీ శ్రీ శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతులయిన శ్రీ మదభినవ విద్యాతీర్ధస్వామి  జగద్గురువులచే ప్రశంసింప బడిన  కారణ జన్ములు. ఆయనే విద్యా వాచస్పతి, ఘనాలంకార, ఘనపాటి చక్రవర్తి, వేద సమ్రాట్,   విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి.
 ప్రముఖ వేద పండితులైన విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి… బ్రహ్మశ్రీ సుబ్బావధానులు, శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు విశాఖపట్నం జిల్లా, చోడవరం తాలూకా, చిన్ననందిపల్లి అగ్రహారంలో సౌమ్య పుష్య బహుళ విదియనాడు (జనవరి 27, 1910) జన్మించారు. రాజోలు సమీపంలోని నరేంద్ర పురంలో బ్రహ్మశ్రీ రాణి సుబ్బావధానులు దగ్గర కూడా కొంతకాలం శిష్యరికం చేసారు. ఆయన వేదం చెబుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదని పలువురి ప్రశంసలు అందుకున్నారు. పిన్నవయస్సులోనే ఆదిభట్ల నారాయణదాసు దగ్గర లయబద్దంగా వేదస్వస్తి చెప్పి, ప్రశంసలు అందుకున్నారు. ఎక్కడైనా వేదసభలు జరుగుతుంటే అందరితో కలసి జగన్నాధ ఘనపాఠి వేదస్వస్తి చెప్పేవారు. అక్కడున్న వేద పండితులంతా కనీసం ఒక ఘనా  పనసైనా చెప్పాలని పట్టుబట్టేవారు.
భారత తొలి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 1961 జూలై 2న “విద్యా వాచస్పతి” పురస్కారం అందుకున్న ఘనపాఠి. అలా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డా జాకీర్ హుస్సేన్, వి. వి. గిరి, డా. శంకర్ దయాళ్ శర్మ, నాటి ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, పి. వి. నరసింహారావు అలాగే డా. కె.ఎల్.రావు వంటి ప్రముఖుల చేత సత్కారాలు పొందారు. శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధులవారు “ఘనాలంకార” బిరుదుతో సత్కరించగా, శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా “ఘనపాఠి చక్రవర్తి” బిరుదుతో సన్మానం అందు కున్నారు. విజయ నగరం వేద పరిషత్ “వేద సమ్రాట్” బిరుదుతో సత్కారం చేయగా, సువర్ణ పతకంతో శృంగేరి శారదా పీఠాధిపతులు, సువర్ణ హారంతో కంచి కామకోటి పీఠాధిపతి సన్మానించారు. సువర్ణ గండ పెండేరంతో విశాఖ వేద శాస్త్ర పరిషత్ సత్కరించింది.
రాజమహేంద్రవర పుర వాసులు 1964లో జగన్నాథ  ఘనపాఠికి సువర్ణ ఘంటా కంకణ సన్మానం చేసారు. 1970లో పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి ఆధ్వర్యాన ఘనపాఠి షష్టిపూర్తి మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. 1975లో రాష్ట్ర ప్రభుత్వం నుండి “పండిత పురస్కారం” అందుకున్నారు. శ్రీ రామభక్త గానసభ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ విశ్వనాధ జగన్నాధ ఘనపాఠికి “కనకాభిషేకం” చేయగా, 1991 జనవరి 2న రాజమండ్రి పురపాలక సంఘం పౌర సన్మానం చేసి, గౌరవించింది. అదేరోజు ఘనపాఠికి “సహస్ర చంద్ర దర్శన మహోత్సవం” పురవాసులు ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తొలి తెలుగు మహాసభలు జగన్నాధ ఘనపాఠి “వేదస్వస్తి” తోనే శుభారంభ మయ్యాయి. ఇందిరాగాంధి ప్రధానిగా వుండగా, పెద జీయర్ స్వామి డిల్లీలో నిర్వహించిన అఖిల వేదశాఖా సమ్మేళనంలో ఘనపాఠి పాల్గొని, లయబద్దమైన వేద స్వస్తితో అందరి ప్రశంసలు పొందారు. రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ తో పాటు, విజయవాడ, టి టి డి వేద శాస్త్ర పరిషత్ లు నిర్వహించే పరీక్షలకు “పరీక్షాధికారి”గా వ్యవహరించారు . కాశీలో శ్రీ రాజేశ్వర శాస్త్రి ద్రవిడ అధ్యక్షతన జరిగిన వేద సభలలో పాల్గొని, వేద వాజ్మయంలో ఓలలాడించారు.
ఇక 1958 ఫిబ్రవరిలో శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘన స్వస్తి ప్రారంభించి, 40 రోజుల పాటు నిర్వహించడమే కాక, పండితులందరికీ సువర్ణ కుండలాలతో సత్కారం చేయించిన ఘనత ఘనపాఠి వారిదే. బ్రహ్మశ్రీలు గుళ్ళపల్లి వెంకట నారాయణ ఘనపాఠి, చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాఠి , శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనపాఠి , ఈమని రామకృష్ణ ఘనపాఠి వంటి ఉద్దండులతో ఈ ఘన స్వస్తిలో జగన్నాధ ఘనపాఠి పాలుపంచు కున్నారు. శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధుల వారితో కలసి “కాశ్మీర్ యాత్ర” సాగించారు.
యావద్భారతదేశంలో పర్యటించి, వేద ప్రచారం గావించిన ఘనపాఠి  వారికి ఎందఱో శిష్యులున్నారు. బ్రహ్మశ్రీలు గోలి కొండావధానులు, అయ్యల సోమయాజుల సుబ్బావధానులు, యడవల్లి రమణావధానులు వంటి వారంతా శిష్యగణంలో వారే. టిటిడి “వేద పారాయణ స్కీం పర్యవేక్షకుని”గా కొంతకాలం సేవలందించిన ఘనపాఠి 1994 ఆగస్టు27 శ్రావణ బహుళ షష్టి శనివారం తెల్లవారు ఝామున మహాభి నిష్క్రమణం (మరణం) చేసారు.
2010, జనవరి 2వ తేదిన ఘనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాధ జగన్నాథ ఘనపాఠి “శత జయంతి సభ” రాజమహేంద్రవరం టిటిడి కల్యాణ మంటపంలో నిర్వహించారు. ఆయన పేరిట వేద శాస్త్ర పరిషత్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రతియేటా కృష్టాష్టమికి వేదసభ నిర్వహించి, పండిత సత్కారం చేస్తున్నారు.

No comment allowed please