Kadambari Jethwani : జేత్వాని కేసులో పోలీసు అధికారుల బెయిల్ పై విచారణ వాయిదా
వైసీపీ హయాంలో జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా....
Kadambari Jethwani : ముంబై నటి జెత్వానీ కేసులో పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కేసును తాజాగా సీఐడీకి అప్పగించారని , కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు. కేసు డిస్పోజ్ అయ్యే వరకు పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యే విధంగా చూడాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ అంశాలను నోట్ చేసుకున్న న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
కాగా.. నటి జెత్వానీ(Kadambari Jethwani) కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ఇటీవల డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా… సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రథమ నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిందితులుగా ఉన్న అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.
Kadambari Jethwani Case Updates
వైసీపీ హయాంలో జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగానే విమానంలో వెళ్లి మరీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. దీంతో తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ(Kadambari Jethwani) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని పోలీసులకు నటి జెత్వానీ ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిరబంధించారని ఆమె పేర్కొన్నారు. తన పూర్వాపరాలు, ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గున్ని ద్వారా ఆరా తీయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. జెత్వానీ(Kadambari Jethwani) ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కేసు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న అతడు పరారవడంతో పోలీసులు ముమ్మరంగా గాలించి గత నెలలో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్‌లో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జి ముందు పోలీసులు హాజరుపరచారు. ఇక.. ఇదే కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ కూడా కీలకంగా ఉన్నారని తేలింది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. అలాగే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : TG DSC 2024 : డీఎస్సీకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల పోస్టింగ్ వాయిదా..