KTR : సీఎం రేవంత్ సర్కార్ చేసుకోవలసింది విజయోత్సవాలు కాదు ‘కరప్షన్ కార్నివాల్’

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే....

KTR : రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు నిర్వహిస్తారా.. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలైందని, కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదని.. ‘కుంభకోణాల కుంభమేళా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదని.. ప్రజావంచన వారోత్సవాలని అన్నారు.

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట.. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట.. బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్(KTR) అన్నారు. ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారని.. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన అని.. మరి ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR Comments..

ప్రజలకిచ్చిన6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దు:ఖంలో ఉంటే.. మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా.. హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా.. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా.. వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్‌లు చేసుకుంటారా‘‘ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాల ప్రక్రియను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా.. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని.. ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదని. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Also Read : KCR : తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది

Leave A Reply

Your Email Id will not be published!