Minister Lokesh : మినిస్టర్ లోకేష్ ను కలిసి విరాళాలు అందిస్తున్న పలువురు నేతలు
ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు వరద బాధితుల కోసం విరాళాలు అందించారు...
Minister Lokesh : ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ.. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Lokesh) ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 , అమలాపురానికి చెందిన బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య రూ.5 లక్షలు,
నంద్యాలకు చెందిన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ ఎస్.దినేష్ రెడ్డి, కాలేజీ డీన్ బి.సూర్యప్రకాశ్ రెడ్డి రూ.4 లక్షలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.2,95,000, నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రూ.2,50,000, మదనపల్లెకు చెందిన గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్.వి రమణారెడ్డి, కట్టా దొరస్వామి నాయుడు రూ.2 లక్షలు, అనంతపురానికి చెందిన వి.సురేష్ నాయుడు లక్ష రూపాయలు, బీజేపీ మజ్దూర్ విభాగం నాయకుడు నాగేశ్వరరావు రూ.10వేలు అందజేశారు. కాగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన వారికి మంత్రి నారా లోకేష్(Minister Lokesh) కృతిజ్ఞతలు తెలిపారు.
Minister Lokesh…
ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు వరద బాధితుల కోసం విరాళాలు అందించారు. తాజాగా ప్రముఖ వ్యాపార సంస్థ అమరరాజా గ్రూపు కూడా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం విరాళాలు అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చొప్పున విరాళం అందించింది. అమరరాజా గ్రూపు కో ఫౌండర్ గల్లా అరుణకుమారి ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు విరాళాలకు సంబంధించి చెక్కులు అందజేశారు. కాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు రూ. 5 లక్షల విరాళం అందజేశారు. ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu)ను కలిసి విరాళం అందించారు.
తెలుగు వారికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి చేయూతనిచ్చి తోడుగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని వరద బాధితులకు అండగా నిలిచింది. ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులు కావడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టంపై చలించిపోయిన ‘తానా’ సేన ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసినట్టు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, పూర్వాధ్యక్షుడు జయ తాళ్లూరి ఒక ప్రకటనలో తెలిపారు. విరాళాల సేకరణకు సోమవారం న్యూయార్క్‌లో ప్రముఖ యాంకర్ సుమతో ఆటాపాటా కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించారని, 200 మందికి పైగా దాతలు హాజరై ఉదారంగా విరాళాలు అందించారని వెల్లడించారు. మానవతా ధృక్పథంతో తానా చేస్తున్న కృషిని న్యూయార్క్ ప్రముఖులు ప్రశంసించారని తెలిపారు.
కాగా కనీవినీ ఎరుగని వరదల తాకిడికి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగర వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించింది. మంగళవారం రాత్రి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంచే నష్ట పరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంతవరకూ రెండు మూడు రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం…వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి రూ.పాతికవేలు, ఆ పై అంతస్థుల్లో ఉన్నవారికి వారు పడిన ఇబ్బందులకు… పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ. పది వేలు, పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికే ఇస్తామని, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వ స్తుందని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు.
విజయవాడ నగరం, దానిని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుందన్నారు. షాపులు, ఇతర వాణిజ్య సంస్ధలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండటంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు రూ.పాతిక వేలు, వ్యాపారం కింద నమోదై రూ.నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ.ఏభై వేలు, రూ.నలభై లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ టర్నోవర్ ఉన్న షాపులకు రూ.లక్ష, అంతకు పైన టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ. లక్షన్నర పరిహారంగా ఇస్తామన్నారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ. మూడు వేలు, ఆటోలకు రూ. పది వేలు, తోపుడు బళ్ళు పోయినా… దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుందన్నారు. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే రూ.పాతిక వేలు, గేదెలు, ఆవులు చనిపోతే రూ.ఏభై వేలు, ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి రూ. నలభై వేలు, పశువుల కొట్టం పోతే రూ. ఏడున్నర వేలు, ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Also Read : CM Chandrababu : వరద బాధితుల సహాయార్థం కీలక ప్రకటన చేసిన సీఎం