Minister Savitha : తోట్లవల్లూరు మండలం పునరావాస కేంద్రంలో పర్యటించిన మంత్రి
ఈ క్రమంలోనే అవనిగడ్డ వరదలో మోపిదేవి మండలం కే కొత్తపాలెం ఎస్సీ కాలనీ ముంపునకు గురైంది...
Minister Savitha : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పునరావాస కేంద్రాలలో మంత్రి సవిత, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా పర్యటించారు. తోట్లవల్లూరు, వల్లూరుపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న లంక గ్రామాల ప్రజలతో మంత్రి సవిత మాట్లాడారు. కేంద్రాల్లో అందిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత(Minister Savitha), ఎమ్మెల్యే కుమార్ రాజా భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. కృష్ణా నది పరివాహ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి సవిత తెలిపారు.
Minister Savitha Visit
కృష్ణా జిల్లా దాదాపుగా వరద ముంపునకు గురైంది. అన్ని ప్రాంతాల్లోనూ వరద నీటిలో చిక్కుకు పోవడంతో అధికారులు పునరావాస కేంద్రాలకు అక్కడి ప్రజలను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ వరదలో మోపిదేవి మండలం కే కొత్తపాలెం ఎస్సీ కాలనీ ముంపునకు గురైంది. ఇళ్లు మొత్తం నీట మునిగి పోవడంతో కరకట్టపైకి దాదాపు 600 మంది గ్రామస్తులుచేరుకున్నారు. వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యత్నించగా ససేమిరా అంటున్నారు. పునరావాస శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరిస్తూ కరకట్టపై గ్రామస్తులు పాకలు వేసుకొన్నారు. పిల్లలు పశువులను వదలి ఎక్కడికో ఎందుకు వెళ్లాలంటూ భోజనానికి కూడా గ్రామస్తులు వెళ్ళడం లేదు.
మరోవైపు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని తన క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రాలుగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్టతపై దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనగాని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరకట్టలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వరదల సమయంలో తీర ప్రాంతాలవారు ముంపునకు గురవుతున్నారని.. కాబట్టి కరకట్టల పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. వర్షాలకు పాము కాటుకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనగాని సూచించారు.
Also Read : Telangana Rains : తెలంగాణ ప్రజలకు ఆ గండం తప్పి వరుణదేవుడు కరుణించి నట్టే