MLA KTR : కల్లాల వద్ద రైతన్నలు 20 రోజులుగా బాధపడుతున్నారు

నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుంది..

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది.. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం.. రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుంది.

అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుంది.. సుఖం వస్తే మొకం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం.. పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది.. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం.. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుంది.. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుంది’’ అంటూ కేటీఆర్(KTR) విమర్ళలు చేశారు.

MLA KTR Comment

సీఎంరేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఆరోపించారు. ఆంధ్రా కంపెనీ, ఈస్ట్‌ ఇండియా అరాచక కంపెనీ అని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే మేఘా కంపెనీకి పలు కాంట్రాక్టులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పొంగులేటికి చెందిన సంస్థ, మేఘా సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు, ఇంజనీర్లు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ ఉద్యోగం ఊడిపోతుందని, ఆ తర్వాత అధికారుల ఉద్యోగాలూ ఊడుతాయని వ్యాఖ్యానించారు.

మూసీప్రాజెక్టు కోసం రేవంత్‌ ఆగమాగం అవుతున్నారని, ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు అప్పజెప్పి.. అక్రమంగా డబ్బులు రాబట్టాలని చూస్తున్నారన్నారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి వెచ్చించనున్న రూ.4,350కోట్లలో రేవంత్‌ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? అని నిలదీశారు. అమృత్‌ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పని చేస్తున్నాయని, వాటి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని అన్నారు. ‘‘వాళ్లు, వీళ్లు జైలుకుపోతారని చెప్పడానికి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎవరు? ఆయనేమైనా హోంమంత్రా..? పోలీస్‌ ఉన్నతాధికారా..? బాంబులు పేల్చడం కాదు.. ముందు ఆయనే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలి.

ఎవ్వరు,ఎప్పుడు అరెస్ట్‌ అవుతారో మంత్రి చెబుతారా? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా..? సర్కస్‌ నడుపుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు.. పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడాలని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతన్నల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయాలని సూచించారు. కాగా, ఈనెల 9న జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ దశాబ్ది ఉత్సవాలకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఈ ఉత్సవాల పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

Also Read : Mithun Chakraborty : బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి పై ఎఫ్ఐఆర్

Leave A Reply

Your Email Id will not be published!