Rahul Gandhi : రాజ్యాంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతుంది..

మీ నాయకుడి అవహేళన చేసినట్టు అనిపించడం లేదా?

Rahul Gandhi : రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. రాజ్యంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారని, మనుస్మృతి రాజ్యాంగానికి అతీతమైనదని తన రచనల్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారని అన్నారు. “సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మీరు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకుడి అవహేళన చేసినట్టు అనిపించడం లేదా? మీ నాయకుడి మాటలను మీరు సపోర్ట్ చేస్తారా?” అని బీజేపీ ఎంపీలను రాహుల్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాహుల్ శనివారంనాడు పాల్గొన్నారు.

Rahul Gandhi Comment

రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్(Rahul Gandhi) అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు. గురువు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బొటనవేలును గురుదక్షిణగా సమర్పించిన కథను రాహుల్ ప్రస్తావిస్తూ.. “మీరు (ప్రభుత్వం) అగ్నివీర్‌ను అమలు చేసినప్పుడు యువకుల బొటనవేళ్లు కత్తిరించారు. 70 పేపర్ లీకేజీలు జరిగాయి.

అదానీకి ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఇక్కడి చిన్న, మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను కోసేశారు. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రక్షణ పరిశ్రమను అదానీకి అప్పగించినప్పుడు దేశంలో నిజాయితీగా పనిచేసే వ్యాపారుల వేళ్లు కత్తిరించారు. ఇవాళ ఢిల్లీ వెలుపల రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రైతులపై లాఠీలు ఝళిపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది?” అని రాహుల్ ప్రశ్నించారు. హథ్రాస్ అత్యాచార బాధితురాలి అంశాన్ని కూడా రాహుల్ ప్రస్తావిస్తూ, నేరానికి పాల్పడిన వారు వీధుల్లో తిరుగుతుంటే, బాధితురాలు మాత్రం ఇంట్లోంచి కదల్లేని పరిస్థితి అని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోందని, కానీ బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉందని ఆరోపించారు.

కలిసికట్టుగారాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని, ఇవాళ రాజకీయ సమానత్వం లేదని, దేశంలోని సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారని, సామాజిక సమానత్వం లేదని, ఆర్థిక సమానత్వం అంతకంటే లేదని రాహుల్ విమర్శించారు. ఆ కారణంగానే కులగణనతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తద్వారా కొత్త తరహాలో రాజకీయాలు జరగనున్నాయని, 50 శాతం రిజర్వేషన్ గోడలు బద్ధలుకొడతామని స్పష్టం చేశారు.

Also Read : RBI : రైతన్నలకు..వ్యవసాయ రుణాలపై శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్

Leave A Reply

Your Email Id will not be published!