Sharad Pawar : పవర్ కోల్పోయిన మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్

అందుకనే,రాజ్యసభకు వెళ్లా. మరో ఏడాదిన్నరలో రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనుంది...

Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధ నేతగా, కీలకమైన వ్యూహకర్తగా పేరొందిన శరద్‌ పవార్‌ రాజకీయ జీవితానికి ఇక తెర పడనుందా? ఇవే తన చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించిన 84 ఏళ్ల పవార్‌.. రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిందా? మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) పేలవమైన ప్రదర్శనను చూస్తే.. ఈ సందేహాలు కలగకమానవు. శరద్‌ పవార్‌(Sharad Pawar) నుంచి విడిపోయి ఎన్సీపీని కైవసం చేసుకున్న అజిత్‌ పవార్‌.. ఏకంగా 41 సీట్లను కైవసం చేసుకోగా, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. శరద్‌ పవార్‌(Sharad Pawar) కుటుంబానికి కంచుకోటగా పేరొందిన బారామతిలో కూడా ఎన్సీపీ (ఎస్పీ) ఓటమి పాలైంది.

లోక్‌సభ ఎన్నికల్లో బారామతిలో తన భార్యను నిలిపి గెలిపించుకోలేకపోయిన అజిత్‌ పవార్‌ ఈసారి స్వయంగా రంగంలోకి దిగి పట్టు నిరూపించుకున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిపై 1.16 లక్షల ఓట్ల మెజారిటీతో అజిత్‌ పవార్‌ ఘన విజయం సాధించారు. ఇదే బారామతిలో ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా.. తన రిటైర్మెంట్‌ గురించి శరద్‌ పవార్‌(Sharad Pawar) పరోక్షంగా వెల్లడించారు. ‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశాను. అన్నిసార్లూ మీరు నన్ను గెలిపించారు. మీ వల్లే నేను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రినయ్యాను. నాలుగుసార్లు సీఎం పదవిని చేపట్టాను. ఇక మీదట సాధారణ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నా.

Sharad Pawar..

అందుకనే,రాజ్యసభకు వెళ్లా. మరో ఏడాదిన్నరలో రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనుంది. మళ్లీ రాజ్యసభ ఎంపీ కావాలని అనుకోవటం లేదు’ అని తెలిపారు. పవార్‌ అంతగా సెంటిమెంట్‌ మాటలు మాట్లాడినా కూడా మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బారామతి ఓటర్లు ఆయనకు ముఖం చాటేశారు. వాస్తవానికి పెద్ద వయస్సు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న శరద్‌ పవార్‌(Sharad Pawar) రాజకీయ జీవితంపై.. ఎన్సీపీని అజిత్‌ పవార్‌ చీల్చి మహాయుతి ప్రభుత్వంలో చేరినప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా శరద్‌ పవార్‌కు అనుకూలంగా తీర్పు రాలేదు. అజిత్‌ పవార్‌ వర్గమే అసలైన ఎన్సీపీ అని న్యాయస్థానం తేల్చింది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా.. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్‌పై పైచేయి సాధించి తన చేవ తగ్గలేదని పవార్‌ నిరూపించుకున్నారు. మహా వికాస్‌ అఘాడీ కూటమి సూత్రధారి అయిన పవార్‌.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏదో మ్యాజిక్‌ చేసి.. మళ్లీ చక్రం తిప్పుతారనే పలువురు భావించారు. కానీ, మహాయుతి ప్రభంజనం ముందు అన్ని అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో.. పవార్‌ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ,కేంద్ర ప్రభుత్వం అండతో శివసేనను కుట్రపూరితంగా చీల్చిన ఏక్‌నాథ్‌షిండే ఓ ద్రోహి అని, అసలైన శివసేన తమదేనని ప్రచారం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే వాదనను మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. షిండే శివసేనకు భారీ విజయం సమకూర్చారు. ఏకంగా 57 స్థానాల్లో గెలిపించారు. ఉద్ధవ్‌ శివసేన కేవలం 20 స్థానాలకు పరిమితమైంది. అఘాడీ కూటమిలోని ఇతర పార్టీలైన కాంగ్రెస్‌ 15, ఎన్సీపీ(ఎస్పీ) 10 స్థానాలే గెల్చుకున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కటానికి అవసరమైనన్ని సీట్లు ఏ పార్టీకీ రాలేదు. ఫలితాల నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే మాట్లాడుతూ, తాము ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడపలేదని, ప్రజల వద్దకు వెళ్లామని ఉద్ధవ్‌ను పరోక్షంగా ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే మరో అడుగు ముందుకేసి.. బాలాసాహెబ్‌ ఠాక్రే ఆశయాల్ని తామే ముందుకు తీసుకెళ్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మృదుస్వభావిగా పేరొందిన 64 ఏళ్ల ఉద్ధవ్‌ ఠాక్రే.. తన వర్గం పార్టీని ఎలా నిలబెట్టుకుంటారు? రాజకీయాల్లో ఉనికిని ఎలా చాటుకుంటారు? అన్న ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Also Read : PM Modi : మహారాష్ట్ర కూటమి విజయంపై మోదీ అభినందనలు

Leave A Reply

Your Email Id will not be published!