నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించడానికి, నైజాం సర్కారు అంతానికి, హైదరాబాద్ రాజ్య, తెలంగాణ ప్రాంత విమోచోద్యమం నిర్వహించారు. ఎందరో ఎన్నో పోరాట రూపాలను నిర్వచించారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి త్యాగమూర్తులలో చోళ లింగయ్య ఒకరు. నేతాజీ స్పూర్తితో, ఇండియన్ నేషనల్ ఆర్మీ లో పని చేస్తున్న లింగయ్య తన ఉద్యోగానికి తృణప్రాయంగా త్యజించి, అర్మీలో తనకున్న అనుభవంతో, సాయుధ పోరాటానికి తెర లేపి, రక్షణ దళాలను ఏర్పాటు చేశారు.
హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య చేసిన వీరోచిత పోరాటమే తెలంగాణ విమోచనోద్యమం.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా, నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించు కోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో మునిగి తేలగా, నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వం నుండి స్వేచ్చా వాయువులు పీల్చ లేక పోయారు. నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు.
నిజాం ఇచ్చిన స్వేచ్ఛ తో, ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడి చేయడం, ఇండ్లు తగలబెట్టడం, మాన భంగాలు, లూటీలు లాంటి నానా అరాచకాలు సృష్టించారు. మతోన్మాద చర్యల కారణంగా ప్రజల నుండి బలవంతపు వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమి కొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో అప్పంపల్లి, ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాదు జిల్లా ఇందూరు, తదితర ప్రాంతాలలో పోరాటం పెద్దఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీ నరసయ్య, ఆరుట్ల కమలా దేవి, రావి నారాయణరెడ్డి, ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, షోయబ్ ఉల్లాఖాన్, మల్లు స్వరాజ్యం రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, కిషన్ తదితరులు తెలంగాణ విమోచనానికి కృషిచేశారు. వీరందరి కృషి, దాశరథి, కాళోజీల కవితల స్ఫూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరుఊ రున, వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, గుత్పలు, కారం ముంతలు, చేతికి అందుబాటులో ఉందల్లా ఆయుధాలుగా మలుచుకొని పోరాడారు. తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగం లోకి దిగారు.
ఇలా వివిధ జిల్లాలలో తెలంగాణ విమోచన పోరాటాలు కొనసాగాయి. అందులో భాగంగానే మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఇండీయన్ నేషనల్ ఆర్మీలోని ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న మిలటరీ పరిజ్ఞానంతో రజాకార్ల దాడులను తిప్పికొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ విమోచన పోరాట యోధునిగా పేరుపొందిన చోళ లింగయ్య జూన్ 13, 1913న మెదక్ పట్టణంలో జన్మించారు. పాఠశాల దశలోనే విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేశారు. . గాంధీ – నెహ్రూ చిత్రపటాలను అవిష్కరించి నందుకు పాఠశాల నుంచి బహిష్కృతులై, 1942లో భారత వైమానిక దళంలో చేరారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో పనిచేసిన చోళ లింగయ్య… సుభాష్ చంద్రబోస్ పిలుపును అందుకొని ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోస్ ఆచూకీ లభ్యం కాని స్థితిలో ఆయన హైదరా బాదుకు వచ్చి తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
1947, ఆగస్టు 15న మెదక్ పట్టణంలోని పటేల్ కుంటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదప అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిజాం సర్కారు లింగయ్యను 1947 సెప్టెంబరు 10న అరెస్ట్ చేసి 7 నెలల పాటు హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉంచింది. విమోచన అనంతరం లింగయ్య హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులుగా, ఆలిండియా కాంగ్రెస్ డెలిగేట్‌గా, 1977లో మెదక్ జిల్లా పార్టీ కోశాధికారిగా పనిచేశారు. 2010 జనవరి 29న పోరాట యోధుడు లింగయ్య మరణించారు.
No comment allowed please