YS Jagan : అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ప్రభుత్వం తీరు దారుణం
కనీసం ప్రభుత్వం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు...
YS Jagan : అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) ఇవాల పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని కంపెనీ బస్సుల్లో తరలించారన్నారు.
కనీసం ప్రభుత్వం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే, వారి తరఫున పోరాటానికి వెనకాడేది లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన అర్ధరాత్రి జరిగినప్పుడు అప్పటి తమ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని జగన్ వెల్లడించారు. 24 గంటల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఘటన జరిగినప్పుడు మంత్రుల సైతం స్పందించని పరిస్థితి నెలకొందన్నారు. పరిశ్రమల సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలన్నారు. దీని కోసం గత ప్రభుత్వ హయాంలో అనేక జీవోలు అమలు చేశామన్నారు. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ లో పేర్లు రాయడం, కక్ష పూరితంగా వ్యవహరించడం మినహా అభివృద్ధి లేదని జగన్ పేర్కొన్నారు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
YS Jagan Meet
వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం కనీసం రూ.20000 సాయం అందించలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదన్నారు. నాడు – నేడు పథకంలో స్కూళ్లు బాగుపడ్డాయని ఇప్పుడు అమ్మ ఒడి పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము అందక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జగన్(YS Jagan) పేర్కొన్నారు. మొత్తానికి అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మా ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు. అంతటితో ఆగక పనిలో పనిగా ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని జగన్ విమర్శిస్తున్నారు. ఐదేళ్ల తన పాలనలో ఏపీ ఎంత మాత్రం అభివృద్ధి చెందిందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అభివృద్ధి గురించి మాట్లాడి జగన్ తన ఇజ్జత్ తనే తీసుకుంటున్నారని జనం అంటున్నారు. కాగా.. చంద్రబాబు ప్రభుత్వం అచ్యుతాపురం ఫార్మా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున పరిహారం అందించింది. క్షతగాత్రులకు సైతం తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున అందిస్తున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
Also Read : MLA Koona Ravi : ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం తమ్మినేనికి అలవాటే