కేటీఆర్ బెట‌ర్..గుత్తా మ‌న‌సులో మాట‌

రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మంచి పేరుంది. ఆయ‌న ఏది మాట్లాడినా దానికి అర్థం..ప‌ర‌మార్థం రెండూ వుంటాయి. ఏది ప‌డితే అది మాట్లాడే మ‌నిషి కాదు. వ్య‌క్తిగ‌తంగా స్నేహ స్వ‌భావి అయిన ఆయ‌న ఉన్న‌ట్టుండి త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట పెట్టారు. నిన్న‌టి దాకా మౌనంగా ఉన్న శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా ఏకంగా సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. ఆయ‌న డైన‌మిక్ నాయ‌కుడ‌ని, ముఖ్య‌మంత్రి అయ్యేందుకు అన్ని అర్హ‌తులు క‌లిగి ఉన్నాడ‌ని చెప్పుకొచ్చారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో గుత్తా తిరుగులేని నాయ‌కుడు. అయితే త‌మ పార్టీకి చెందిన ప్ర‌జా నాయ‌కుడు నోముల న‌ర‌సింహ‌య్య మృతితో ఏర్ప‌డిన ఖాళీ స్థానంలో అభ్య‌ర్థిని ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే భావుంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
గ‌తంలో కూడా ఎవ‌రైనా అకాల మ‌ర‌ణం చెందితే, వారి కుటుంబంలో ఒక‌రికి ఆ సీటును కేటాయించాల‌ని, ఇందుకు సంబంధించి ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే..ఏ వ‌ర్గంకు చెందిన వారైనా స‌రే వారికి ప‌ని చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే సంస్కృతి కొన‌సాగింద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి త‌న‌ను పోటీ చేయ‌మ‌ని ఎవ‌రూ అడుగ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో న‌క్స‌లైట్లు మట్టున బెట్టిన రాగ్యానాయ‌క్ చ‌నిపోతే ఆయ‌న కుటుంబానికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరామ‌న్నారు. ఇపుడు కూడా అన్ని పార్టీలు ముందుకు వ‌చ్చి నోముల స్థానాన్ని ఏక‌గ్రీవం చేసే విష‌యం మ‌రోసారి ఆలోచించు కోవాల‌ని కోరారు.
రాజ‌కీయాల‌లో ఓట‌ములు, గెలుపులు స‌హ‌జం. వాటిని పెద్ద‌గా ప‌ట్టించు కోవాల్సిన ప‌ని లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద నేత‌లు..చిన్న నేత‌లు అంటూ ప్ర‌జ‌లు చూడ‌రు. ఎవ‌రైతే త‌మ కోసం నిల‌బ‌డ‌తార‌ని న‌మ్ముతారో వారికే ఓట్లు వేస్తారని తెలిపారు. ఎంతో సీనియ‌ర్ నాయ‌కుడైన కందూరు జానారెడ్డి మూడు సార్లు ఓడిపోయాడ‌ని గుర్తు చేశారు. స్థానికులా స్థానికేత‌రులా అన్న స‌మ‌స్యే ఉత్ప‌న్నం కాద‌న్నారు. ఇటీవ‌ల ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌జా ప్ర‌తినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారు ఉప‌యోగిస్తున్న భాష స‌రిగా ఉండ‌డం లేదు. జ‌నం గ‌మ‌నిస్తున్నార‌న్న విష‌యాన్ని గుర్తుంచు కోవాల‌ని సూచించారు గుత్తా. మ‌నుషుల‌కు కాకుండా ప‌ద‌వుల‌కు గౌర‌వం ఇవ్వాలి. అప్పుడే రాజ‌కీయాల‌పై ..నాయ‌కుల‌పై ప్రేమ పెరుగుతుంద‌న్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎల్ ఆర్ ఎస్ ఇంపాక్ట్ త‌మ‌పై ప‌డింద‌న్నారు. మొత్తం మీద గుత్తా సైతం కేటీఆర్ కు జై కొట్టార‌న్న మాట‌.

No comment allowed please