#Nyapati : జనవరి 14 .. ఆంధ్రా భీష్మాచార్యులు న్యాపతి సుబ్బారావు పంతులు 164 వ జయంతి

164th birth anniversary of Andhra Bhishmacharya Nyapati Subbarao Panths

Nyapati : చికాగో సర్వ ధర్మ సమ్మేళనంలో పాల్గొని, భారత దేశానికి తిరిగి వచ్చిన స్వామి వివేకానంద యోగి పుంగవుడు మద్రాసు రేవులో కాలిడగానే ఆయనను పూల మాలాలంకృతుల గావించి సాదరంగా ఆహ్వానించే అవకాశాన్ని పొందిన వ్యక్తి న్యాపతి సుబ్బారావు. అంతేకాదు… వివేకానందుని ఆహ్వాన సభకు అధ్యక్షత వహించిన అరుదైన గౌరవం దక్కించుకున్న అదృష్ట వంతులు ఆయనే.

భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికకు పత్రికను స్థాపించి ఇప్పటికి సుమారు 120 సంవత్సరాలు దాటింది. ఈ పత్రిక ఎలా ప్రారంభించ బడింది అంటే…తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణియ అయ్యర్, ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ – నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులు (హిందూ స్థాపకుల్లో ఆంధ్రుడు) – వీళ్ళందరూ ట్రిప్లికేన్ సాహితీ సంఘం సభ్యులు. ఈ సంఘం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ వైఖరుల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం లక్ష్యాలుగా ఏర్పడింది. ట్రిప్లికేన్ సిక్స్ అని పేరుబడ్డ ఆ ఆరుగురు యువకులు మొదట న్యూస్‌పేపర్ అనే సైక్లోస్టైల్ పక్షపత్రికను ప్రారంభించారు. చెన్నైలో ఆ పత్రికకు మంచి స్పందన లభించడంతో హిందూను వారపత్రికగా ప్రచురించడం మొదలు పెట్టారు. ది హిందూ పత్రిక స్థాపన సెప్టెంబర్ 20, 1878న జరిగినట్లు పేర్కొంటారు. అలా ది హిందూ ఆంగ్ల పత్రిక స్థాపనలో ఒక తెలుగు వారు ఉండడం విశేషం. ఏ ఐ సీ సీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పని చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఆంధ్ర భీష్మ బిరుదాంకితులు, ప్రసిద్ధి స్వాతంత్య్ర సమర యోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, న్యాపతి సుబ్బారావు పంతులు (1856, జనవరి 14 – 1941, జనవరి 15) మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించారు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది. బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించారు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారత దేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. న్యాయ విద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. అప్పట్లో భారత దేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.

ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తి గా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డారు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించారు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవారు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించారు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించారు.

1885లో రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి నళ్ళాల కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగారు. 1896లో ఆయన రాజమండ్రి లోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది. సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. 1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటు లోకి తెచ్చారు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించారు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించారు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణ దాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఆయనే. 1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించారు.

1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారత దేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించ డానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించారు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత, సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించారు.

1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించారు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించారు. విజయ వాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపు నిచ్చారు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యారు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించారు.
సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన మరణించారు.

No comment allowed please