GVL Narasimha Rao : 5జీ సేవలు వైజాగ్ లో ఏర్పాటు చేయాలి
కేంద్రానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
GVL Narasimha Rao : భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కీలకంగా మారిన టెలికాం సేవలకు సంబంధించి ఏపీలోని విశాఖపట్టణానికి 5జీ సేవలు అందించేలా చూడాలని కేంద్ర సర్కార్ కు విన్నవించారు. ఈ మేరకు జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) కేంద్ర టెలికాం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు.
ఏపీలో అత్యంత అభివృద్ది చెందిన నగరంగా విశాఖపట్టణం ఉందన్నారు. మెట్రో నగరాల సరసన విశాఖను కూడా చేర్చాలని కోరారు. వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ పోర్టు సిటీలో 5జీ నెట్ వర్క్ సేవలను ప్రారంభించాలని బీజేపీ రాజ్య సభ సభ్యుడు అభ్యర్థించారు.
కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్(Ashwini Vaishnaw) కు లేఖ రాసిన విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ది ఇంజిన్ అని పేర్కొన్నారు. అందువల్ల నగరంలో 5జీ సేవలను ప్రారంభించడం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ఇతర నగరాలు విజయవాడ, రాజమహేంద్ర వరం, కాకినాడ, తిరుపతిలలో 5జీ వైర్ లెస్ టెక్నాలజీని ప్రారంభించడాన్ని పరిశీలించాలని బీజేపీ నాయకుడు లేఖలో ఐటీ మంత్రిని అభ్యర్థించారు.
విశాఖపట్నం పోర్ట్ , హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ , హిందూస్తాన్ పెట్రోలియం, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ వంటి ఇతర సంస్థలు వైజాగ్ లో కొలువుతీరి ఉన్నాయని తెలిపారు జీవిఎల్ నరసింహారావు. వ్యూహాత్మక, జాతీయ భద్రతా దృక్ఫథంతో కూడా ఇది చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.
Also Read : ఎన్నికల్లో హామీలపై పార్టీలకు బిగ్ షాక్