Tirumala : పోటెత్తిన భక్తజనం గోవింద నామ స్మరణం
శ్రీవారిని దర్శించుకున్న 78,487 మంది భక్తులు
Tirumala : గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతోంది పవిత్రమైన పుణ్య క్షేత్రం , కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కొలువై ఉన్న తిరుమల. ఎక్కడ చూసినా భక్తులే. జనసందోహంతో తిరుమల జాతరను తలపింప చేస్తోంది. చిన్నారుల నుంచి వృద్దుల దాకా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నానా కష్టాలకు ఓర్చి నిరీక్షిస్తున్నారు. స్వామి వారి కరుణ కటాక్షం తమ పై ఎల్లవేళలా ఉండాలని ఆ దేవ దేవుడిని ప్రార్థిస్తున్నారు. వేడుకుంటున్నారు.
గోవిందా గోవిందా..ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ నామ స్మరణతో తిరుమల గిరులు హోరెత్తుతున్నాయి. కొండలపై నెలకొన్న శ్రీనివాసుడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా కొలవడుతుండడం విశేషం. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలుకు ఓర్చుకుని తిరుమలకు వచ్చిన అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి పర్యవేక్షణలో, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాన్య భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జూన్ 14న బుధవారం ఒక్క రోజు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు. ఆదివారం 90 వేలను దాటితే నిన్న ఒక్క రోజే 78 వేల 487 మంది దర్శించుకున్నారు. 38 వేల 213 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన విరాళాలు, హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చాయని టీటీడీ వెల్లడించింది. భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
Also Read : Chandrababu Naidu : పవర్ లోకి వస్తాం తిన్నదంతా కక్కిస్తాం
