Manmohan Singh : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మాజీ పీఎం
వీల్ చైర్ పై వచ్చి ఓటేసిన మాజీ పీఎం
Manmohan Singh : ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థిక వేత్త. దేశంలో సంస్కరణలకు, ఆర్థిక పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతే కాదు భారత దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించారు డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh).
సోమవారం ఆయన ఆరోగ్యం బాగో లేక పోయినా వీల్ చైర్ పై వచ్చి తన విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగ్ ను చూసి చాలా మంది ఆయనను పలకరించారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.
బీజేపీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉండగా ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.
ఈ సందర్బంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ మంతటా పార్లమెంట్ లో , రాష్ట్ర శాసనసభలలో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది.
కాగా మన్మోహన్ సింగ్ వయస్సు ఇప్పుడు 89 ఏళ్లు. నలుగురు అధికారుల సహాయంతో ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓటు వేస్తున్న దృశ్యాలు , ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ ఏంటో, దాని ప్రాధాన్యత ఏమిటో మాజీ ప్రధాన మంత్రి(Manmohan Singh) తెలియ చెప్పారని పలువురు ప్రశంసిస్తున్నారు. హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఆరోగ్యం బాగా లేక పోయినా ప్రజాస్వామిక బాధ్యతను నెరవేర్చారంటూ యువజన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ కొనియాడారు. జాతి నిర్మాణం కోసం అసమానమైన అంకిత భావంతో ఉన్న విజనరీ లీడర్ గా నిలిచి పోతారంటూ పేర్కొన్నారు.
Also Read : పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా