Piyush Goyal : ధరల పెరుగుదలపై చర్చకు సిద్దం
రాజ్యసభలో పీయూష్ గోయల్ ప్రకటన
Piyush Goyal : విపక్షాలు చేస్తున్న ఆందోళనలో అర్థం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మంగళవారం రాజ్యసభలో పీయూష్ గోయల్ మాట్లాడారు. ధరల పెరుగుదలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో 19 మంది ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరమైన విషయంగా పేర్కొన్నారు. కానీ వారు పదే పదే తమ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారని, సభా వ్యవహారాలు సజావుగా సాగాలని కోరుకుంటామన్నారు.
కానీ వారు పదే పదే కావాలని అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. కావాలని అడ్డుకోవడం వల్లే ఎంపీలపై వేటు వేయాల్సి వచ్చిందని చెప్పారు పీయూష్ గోయల్(Piyush Goyal). వాళ్లు ఏదైనా అడగవచ్చు. దానికి వారికి హక్కుంది.
కానీ సభా కార్యక్రమాలను సజావుగా సాగనీయ కూడదనే దురుద్దేశం మంచి పద్దతి కాదన్నారు. ఈ విషయాన్ని సభా కార్యక్రమాలు ప్రారంభించే కంటే ముందే స్పష్టం చేయడం జరిగిందన్నారు.
కొంత మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని చైర్మన్ నిర్ణయించారు. ధరల పెరుగుదలనే కాకుండా ఏ అంశంపైన నైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎంపీలందరికీ స్పష్టంగా తెలియ చేయడం జరిగిందన్నారు.
కానీ వారు సభకు అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారంటూ పీయూష్ గోయల్(Piyush Goyal) ఆరోపించారు. అనారోగ్యం కారణంగా సభకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కాలేక పోయారని ఈ సందర్భంగా తెలిపారు.
రాజ్యసభ సమావేశం అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఇతర సభ్యులు ప్రశ్నలు అడగకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : మాజీ సీఎం ఫరూక్ అబ్దులాపై ఈడీ కేసు