Sonia Gandhi ED : ఆరు గంటల విచారణ మళ్లీ సమన్లు
సోనియా గాంధీకి ఈడీ ప్రశ్నల వర్షం
Sonia Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మంగళవారం ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని విచారించింది.
74 ఏళ్ల వయస్సు కలిగిన సోనియా గాంధీని ఆరు గంటలకు పైగా ప్రశ్నించింది. కేసు విచారణలో భాగంగా మరోసారి రేపు జూలై 27న కూడా తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.
దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పార్టీకి చెందిన సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ రోడ్డుపైనై బైఠాయించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని, పోలీసు రాజ్యం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రధానిని రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అణిచి వేసేందుకు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు. మరో వైపు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. సమన్లు జారీ చేసింది. ఇవాళ ఈడీ ముందుకు సోనియా గాంధీ(Sonia Gandhi ED) తో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వెంట వచ్చారు.
Also Read : ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారు – టీఎంసీ