YS Jagan : ప్రజా సంక్షేమానికే ప్రయారిటీ
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. కాపులతో పాటు ప్రతీ సామాజిక వర్గం బాగుండాలని తాము కోరుతున్నామన్నారు.
ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు వైసీపీ మేనిఫెస్టోలో చేర్చక పోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్న ఘనత తమదేనన్నారు.
మూడు లక్షల మంది అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే భాగ్యాన్ని దేవుడు తనకు ఇచ్చాడని అన్నారు జగన్ రెడ్డి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలులో కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరు బాగుండాలన్నదే నా లక్ష్యం. నా ఆశయం కూడా అదే. ఏ ఒక్కరూ తిండి కోసం , ఉపాధి కోసం ఇబ్బంది పడకూడదని నా కోరిక.
దాని కోసమే ప్రయత్నం చేస్తున్నా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతున్నామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి.
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారి జీవన ప్రమాణాలు మరింత పెంచేందుకే తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది మూడో ఏడాది. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటి దాకా 1,492 కోట్ల రూపాయల సాయం అందజేశామని చెప్పారు ముఖ్యమంత్రి. మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి రూ. 16, 256 కోట్ల లబ్ది చేరిందన్నారు జగన్ రెడ్డి.