Droupadi Murmu : శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ సిద్దం
స్పష్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకకు అభయం ఇచ్చారు భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు లంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిలె విక్రమసింఘేకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము లేఖ రాశారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేసేందుకు భారత దేశం సిద్దంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు.
పరస్పరం సహాయ సహకారాలు అందిపుచ్చు కోవడం అన్నది నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఒక దేశం పట్ల మరో దేశం స్నేహ పూర్వకంగా ఉంటేనే ప్రపంచంలో శాంతి కొనసాగుతుందన్నారు ద్రౌపది ముర్ము(Droupadi Murmu).
ప్రజలు ఏ ఒక్కరు ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో ఉండేందుకు వీలు లేదని పేర్కొన్నారు. భారత దేశం ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో సత్ సంబంధాలను కోరుకుంటుందని తెలిపారు.
ఆర్థిక సంక్షోభాల కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో భారత్ తోడ్పాటు అందిస్తుందని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
భాగస్వామ్య వారసత్వం , ప్రజల మధ్య లోతైన సంబంధాల ఆధారంగా ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ద్రౌపది ముర్ము లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రపతిగా కొలువుతీరిన నన్ను మీరు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు. శ్రీలంకకు 8వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.
ఈ క్లిష్ట, సంక్షోభ సమయంలో శ్రీలంకకు బాధ్యతలు వహించడం సవాళ్లతో కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము. మున్ముందు భారత్ తన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.
Also Read : సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి