Rahul Gandhi : ప్రజాస్వామ్యానికి సమాధి రాచరికానికి పునాది
ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం పోరు బాటకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ కు బయలు దేరిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి సమాధి కట్టారని రాచరికానికి పునాది వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
నలుగురైదుగురు బడా వ్యాపారవేత్తల కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 133 కోట్ల భారతీయుల చెవుల్లో పూలు పెట్టారని మండిపడ్డారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఊహించని రీతిలో పెరిగి పోయిందన్నారు. సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక దేశంలో చోటు చేసుకున్న సంక్షోభం భారత్ లో కొనసాగే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ.
ఇకనైనా ప్రజలు మేలు కోవాలని, ప్రభుత్వ సంస్థలను కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలు, పార్టీలు లేకుండా చేయాలని చూస్తున్నారంటూ మోదీపై మండిపడ్డారు.
ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిధి మించి వ్యవహరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : కాంగ్రెస్ ఆందోళన రాహుల్ గాంధీ అరెస్ట్