Draupadi Murmu : జన్మాష్టమి పుణ్య మార్గానికి ప్రేరణ
దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
Draupadi Murmu : దేశ వ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యూపీలోని మధుర అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇక బృందావనం భక్తులతో పోటెత్తుతోంది.
జన్మాష్టమి సందర్భంగా దేశంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu). జన్మాష్టమి ప్రార్థన పుణ్య మార్గాన్ని అనుసరించేందుకు ప్రేరణగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
దేశంలోని వారే కాకుండా ఇతర దేశాలలో నివసిస్తున్న వారంతా ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రపతి.
శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు ఎప్పటికీ ఆదర్శ ప్రాయంగా ఉంటాయన్నారు. ఆయన చేసిన బోధనలు క్షేమం, ధర్మానికి సంబంధించిన సందేశం నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని కొనియాడారు ద్రౌపది ముర్ము.
నిష్కం కర్మ అనే భావనను ప్రచారం చేసి ధర్మ మార్గం ద్వారా పరమ సత్యాన్ని పొందేలా ప్రజలకు జ్ఞానోదయం కలిగించాడు శ్రీకృష్ణ భగవానుడు అని కితాబు ఇచ్చారు రాష్ట్రపతి.
ఈ జన్మాష్టమి పండుగ రోజున మన ఆలోచన, మాట, క్రియలలో పుణ్య మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించేలా చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ద్రౌపది ముర్ము.
ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా యూపీలోని మధుర, బృందావనం శోభాయమానంగా రూపు దిద్దుకున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎ
క్కడా చిన్న సంఘటన జరిగినా వెంటనే పసిగట్టేలా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక దేశం నలు మూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలి వచ్చారు. కృష్ణుడి పాటలతో , నృత్యాలతో హోరెత్తుతోంది మధుర.
Also Read : జన్మాష్టమి వేడుకలకు ‘మధుర’ ముస్తాబు