Rakesh Tikait : తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం
ప్రకటించిన రైతు అగ్ర నేత టికాయత్
Rakesh Tikait : యూపీలోని లఖింపూరి ఖేరిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల నిరసన దీక్ష ముగిసింది. రైతులతో పాటు ఎనిమిది మంది మృతికి కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని, రైతుల కుటుంబాలను ఆదుకోవాలని, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, తదితర ప్రధాన డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు.
రైతులను ఉద్ధేశించి సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్(Rakesh Tikait) ప్రసంగించారు. కేంద్రం దిగి వచ్చేంత వరకు , మంత్రిని తొలగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు.
సాగు చట్టాలను రద్దు చేసిన మోదీ సర్కార్ ఈరోజు వరకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ నిప్పులు చెరిగారు టికాయత్. వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా సాయం చేసిన దాఖలాలు లేవన్నారు.
తమ న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత దాకా పోరాటం వివిధ రూపాలలో కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6న సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీలో కీలక భేటీ అవుతుందన్నారు.
ఈ సమావేశంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తామని, ఆ తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకటించారు రైతు నేత రాకేశ్ టికాయత్.
ఇదిలా ఉండగా రైతు ధర్నా వద్దకు జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ డిమాండ్లను వివరించారు.
రైతులతో చర్చించేందుకు 6న ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రైతులను చంపిన కేసులో కేంద్ర మంత్రి కుమారుడు ఇంకా జైలులోనే ఉన్నాడు.
Also Read : ప్రజలను ఆదరించండి సేవ చేయండి – తేజస్వి