Bilkis Bano Case : బిల్కిస్ దోషుల విడుదలపై ‘సుప్రీం’ విచారణ
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వెల్లువెత్తిన నిరసన
Bilkis Bano Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో(Bilkis Bano Case) సామూహిక అత్యాచారం, చిన్నారితో పాటు కుటుంబీకుల దారుణ హత్య కేసులో దోషులుగా తేలిన వారిని గుజరాత్ ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది.
దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. జీవిత ఖైదు విధించిన వారిని బయటకు ఎలా తీసుకు వస్తారంటూ 6 వేల మందికి పైగా మహిళలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్చంధ, మానవ హక్కుల సంస్థలు , మేధావులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రశ్నించారు.
ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీని, గుజరాత్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ఈ తరుణంలో దోషులను వెంటనే వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు.
దోషులకు పూల దండలు కాదు కావాల్సింది ఉరి తాళ్లేనంటూ ప్రచారం జోరందుకుంది. వీరి విడుదలను ప్రశ్నిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ ) పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీతో పాటు మరో ఇద్దరు ప్రజా ప్రయోజనాల కింద పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. ఆగస్టు 15న రిమిషన్ పాలసీ కింద విడుదల చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అనుమతించిన తర్వాత గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వెళ్లి పోయారు.
జనవరి 21, 2008 ముంబై లోని ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష ను ఖరారు చేసింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. దోషులుగా ఖరారైన వారిలో జస్వంత్ భాయ్ నాయ్ , గోవింద్ భాయ్ నాయ్ , శైలేష్ భట్ , రాధేశం షా , బిపిన్ చంద్ర జోషి, కేసర్ భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్దియా, బకాభాయ్ వోహానియా, రాజు భాయ్ సోనీ, మితేష్ భట్ , రమేష్ చందానా ఉన్నారు.
Also Read : బీజేపీ లీడర్ సోనాలీ ఫోగట్ మృతి