KTR : తెలంగాణపై కేంద్ర సర్కార్ వివక్ష
నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
KTR : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ప్రతి రోజూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దీనికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య షాకింగ్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఎలా, ఎవరికి మంజూరు చేయాలని ప్రశ్నించారు.
ఆయన కేటీఆర్ చెప్పిన మాటలు అబద్దాలేనని పేర్కొన్నారు. ఈ తరుణంలో శుక్రవారం కేటీఆర్(KTR) మరో సంచలన ఆరోపణలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపించిందంటూ మండిపడ్డారు.
ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో సక్సెస్ అయ్యారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తాము ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామన్నారు.
కానీ దానిపై స్పందించిన దాఖలాలు లేవన్నారు మంత్రి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా పేరొందిందని చెప్పారు. ఇదే సమయంలో ఐటీ, లాజిస్టిక్, ఇతర రంగాలకు చెందిన కంపెనీలన్నీ నగరాన్ని ఎంపిక చేసుకున్నాయని తెలిపారు.
కానీ కేంద్రం కావాలని తెలంగాణ పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భూ సేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో సిద్దంగా ఉన్న ఫార్మా సిటీని కేంద్రం కావాలనే విస్మరించిందని మండిపడ్డారు.
కావాలనే కేంద్రం అనుమతి ఇవ్వకుండా తాత్సారం చూపించిందంటూ ఆరోపణలు చేశారు. కొత్తగా ఏర్పాటు చేయాలంటే కనీసం మూడు సంవత్సరాలకు పైగా సమయం పడుతుందన్నారు కేటీఆర్.
Also Read : కామారెడ్డి కలెక్టర్ పై నిర్మలా కన్నెర్ర