CM KCR : పని తీరు ఆధారంగానే సీట్లు కేటాయింపు
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హితబోధ
CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాలలో పనులు విస్తృతంగా చేసినా ఎందుకని ప్రజలకు చేరడం లేదని ప్రశ్నించారు.
పనితీరు మెరుగు పర్చుకోవాలని లేక పోతే సీట్లు ఇవ్వడం కష్టమన్నారు. పార్టీకి కేడర్ ముఖ్యమని వారిని మరింత ఉత్సాహవంతంగా చేయాలని పిలుపునిచ్చారు.
వారితో కలిసి వన భోజనాలు చేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదన్నారు. కేవలం కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు.
ఇక నుంచి జాతీయ స్థాయి రాజకీయాలలో అడుగు పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు కేసీఆర్. పార్టీ కోసం పని చేస్తున్న వారిలో కొందరికి కేంద్ర మంత్రులు, గవర్నర్లుగా ఛాన్స్ లభిస్తుందన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు రాష్ట్రంలో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి కనీసం 90 నుంచి 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్(CM KCR).
ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ హైదరాబాద్ లో ఉండ కూడదని ఆయా నియోజకవర్గాలలోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో సీఎం సమీక్షించారు.
రెండు గంటలకు పైగా రివ్యూ చేశారు. నియోజకవర్గానికి సంబంధించి 500 మంది చొప్పున దళితులకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు కేసీఆర్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుగా వెళ్లే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, ముందు నియోజకవర్గాలలో ఫోకస్ పెట్టాలన్నారు.
Also Read : కర్ణాటక బ్రాండ్ అంబాసిడర్ గా సుదీప్