Nitish Kumar : రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ భేటీ
అరవింద్ కేజ్రీవాల్ తో కీలక సమావేశం
Nitish Kumar : 17 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని వదులుకుని ప్రతిపక్షాలతో జత కట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ దేశ రాజకీయాలలో కీలకమైన నాయకుడిగా మారారు.
ఈ దేశానికి అతి పెద్ద ప్రమాదకారి భారతీయ జనతా పార్టీనేనంటూ మండిపడుతున్నారు. పనిలో పనిగా కాషాయానికి ప్రత్యామ్నాయంగా పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు.
ఇటీవలే మణిపూర్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యింది. కానీ జార్ఖండ్ లో అది వర్కవుట్ కాలేదు. అక్కడ జేఎంఎం చీఫ్ , సీఎం హేమంత్ సోరేన్ సత్తా చాటారు.
విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఇది పక్కన పెడితే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీతో(Rahul Gandhi) నితీశ్ కుమార్ భేటీ అయ్యారు.
కీలక చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు , ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే మార్గాలపై రాహుల్, నితీశ్ చర్చించినట్లు సమాచారం.
బీహార్ లో ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన తర్వాత నితీశ్ కుమార్(Nitish Kumar) కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు బీహార్ సీఎం మిషన్ ఆప్షన్ కు శ్రీకారం చుట్టారు.
పనిలో పనిగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. ప్రతిపక్షాలను ఏకం చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా నితీశ్ కుమార్.
తనను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విపక్ష నేతలను ఒకే గూటికి తీసుకు రావడమే తన ముందున్న లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు నితీశ్ కుమార్.
Also Read : రాజ్ పథ్ పేరు మార్పుపై మహూవా ఫైర్