Menaka Gambhir ED : అభిషేక్ బెనర్జీ కోడలికి సమన్లు
మరోసారి షాక్ ఇచ్చిన ఈడీ
Menaka Gambhir ED : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీకి మరో షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ మనీ లాండరింగ్ కేసులో ఎంపీ బంధువుకి సమన్లు జారీ చేసింది.
ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ ఆధారంగా అభిషేక్ బెనర్జీ బంధువైన మేనకా గంభీర్ కు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ నిరాకరించారు.
ఇదిలా ఉండగా ఎంపీకి మేనకా గంభీర్(Menaka Gambhir ED) కోడలు అవుతుంది. విదేశాలకు వెళ్లకుండా కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఈడీ ఆపేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు అందజేసింది.
ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా మేనకా గంభీర్ రాత్రి 9 గంటల సమయంలో బ్యాంకాక్ కు విమానంలో బయలు దేరేందుకు విమానాశ్రయానికి బయలు దేరారు.
విమాన ప్రయాణికుల ప్రాంగణంలోకి చేరుకునే సరికల్లా మేనకా గంభీర్(Menaka Gambhir ED) కు షాక్ తగిలింది. ఎల్ఓసీ ఆధారంగా ఆమెకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ నిరాకరించినట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
ఆమెను వెళ్లకుండా నిలిపి వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం అందించారు. ఆ వెంటనే ఈడీ ఆఫీసర్లు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. విచారణకు రావాల్సిందిగా సమన్లు ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ లోని బొగ్గు స్కాంకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కోల్ కతా లోని సాల్ట్ లేక్ ఏరియా లోని కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఏజెన్సీ ముందు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.
Also Read : కేసీఆర్ కుమార స్వామి భేటీపై ఉత్కంఠ