Hyderabad Fire : ఎలక్ట్రిక్ షోరూంలో మంటలు 8 మంది మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Hyderabad Fire : సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ బైక్ (విద్యుత్ వాహనాల) షో రూంలో అగ్ని ప్రమాదం(Hyderabad Fire) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుకాణంలోని ఒక బ్యాటరీ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం. దీని కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే షాపు పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జీ పైకి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
దీంతో చుట్టు పక్కల ఉన్న వారంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పరిస్థితి భయానకంగా ఉంది. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఊపిరి ఆడక ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.
ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని హుటా హుటిన యశోద, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లాడ్జిలో 25 మంది దాకా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తమ ప్రాణాలు రక్షించు కునేందుకు ప్రయత్నాలు చేశారు. కొందరు కిటికీలను దాటుకుని వచ్చేందుకు యత్నించారు. లాడ్జిలో చిక్కుకు పోయిన మరో 9 మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు.
ఇందులో ఒకరు మహిళ ఉన్నట్లు గుర్తించారు. రూబీ లాడ్జి ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రస్తుతానికి సీజ్ చేశారు.
మరో వైపు నియమ నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ లో షో రూం నిర్వహిస్తున్నందుకు గాను రంజిత్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైందని చెప్పారు తెలంగాణ హోం శాఖ మంత్రి మెహమూద్ అలీ.
Also Read : వ్యవసాయం..విద్యుత్ అమ్మేందుకు కుట్ర